Parivarthana Rajaneethi Party
* పరివర్తన రాజనీతి పార్టీ (PRP)
* 11-11-11 ముహూర్తానికి పార్టీ ఆవిర్భావం..
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ మాజీ నేత వి. విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో తన నూతన రాజకీయ పార్టీని విజయవాడలో ప్రకటించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పేరు, జెండాను విజయసాయిరెడ్డి ప్రకటించారు.
తెలుపు, కాషాయ రంగుల్లో పార్టీ జెండా..
పరివర్తన రాజనీతి పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో శంఖం, చక్రం గుర్తులను ఏర్పాటు చేశారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరిస్తూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం, ధర్మం కోసం తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతోనే కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. రాజకీయాల్లో యువతకు అవకాశాలు కల్పించడంతో పాటు, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడమే తమ ఉద్దేశమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని గతంలోనే విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో రాజకీయ వేదిక అందుబాటులోకి వచ్చింది. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. రానున్న రోజుల్లో పార్టీ విస్తరణ, యువతకు కల్పించే ప్రాధాన్యం, రాజకీయంగా అనుసరించబోయే వ్యూహాలపై ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

