రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రధానం
* దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పట్టణంగా బిల్హా..
* వరుసగా జాతీయ గుర్తింపు!
* మహిళలతో చెత్త నిర్వహణలో ఆదర్శం..
* స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఛత్తీస్‌గఢ్‌కు మూడు అవార్డులు
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్ : పరిశుభ్రత సాధించాలంటే భారీ బడ్జెట్ మాత్రమే అవసరం లేదని ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న పట్టణం నిరూపిస్తోంది. కేవలం 15 వేల జనాభా ఉన్న బిల్హా పట్టణం దేశవ్యాప్తంగా మరోసారి గుర్తింపు పొందింది.
20 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల విభాగంలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పట్టణంగా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యర్థాల సేకరణ, నిర్వహణ విధానం ఈ విజయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఛత్తీస్‌గఢ్‌కు మొత్తం మూడు గుర్తింపులు లభించాయి. బిల్హా జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించగా, స్వచ్ఛ రివర్ ఫ్రంట్ టౌన్ విభాగంలో బిలాస్పూర్ రెండో స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా రాయ్‌పూర్ గుర్తింపు పొందింది. నవంబర్ 11న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు.

* 28 మంది మహిళలతో బిల్హా పరిశుభ్రత మోడల్..
సుమారు 15 వేల జనాభా కలిగిన బిల్హా పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమాలకు మహిళలు ప్రధాన బలంగా నిలుస్తున్నారు. పట్టణంలోని 15 వార్డుల్లో 28 మంది స్వచ్ఛతా దీదీలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు.
ఇందుకోసం ఈ-రిక్షాలను వినియోగిస్తున్నారు. సేకరించిన వ్యర్థాలను ఘన, ద్రవ వనరుల నిర్వహణ కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. పొడి వ్యర్థాల్లో తిరిగి ఉపయోగించగల పదార్థాలను వేరు చేసి విక్రయిస్తారు.
దీంతో చెత్త నిర్వహణ ద్వారా మహిళలకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. వీరికి తోడుగా మరో పది మంది పారిశుద్ధ్య కమాండోలు శుభ్రత కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కల్పించే పనుల్లో సహకరిస్తున్నారు. ఈ విధానంతో చెత్త సేకరణను కేవలం మున్సిపాలిటీ బాధ్యతగా కాకుండా, మహిళలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమంగా మార్చారు.

* నదీతీర పరిశుభ్రతలో బిలాస్‌పూర్‌కు రెండో స్థానం..
స్వచ్ఛ రివర్ ఫ్రంట్ టౌన్ విభాగంలో బిలాస్పూర్ దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని సాధించింది. మధ్యప్రదేశ్‌లోని రేవా మొదటి స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి తర్వాతి స్థానంలో నిలిచింది.
నదులు, వాటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ఈ విభాగాన్ని తొలిసారిగా ఈ ఏడాది ప్రవేశపెట్టారు. అర్పా నది పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు బిలాస్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పలు కార్యక్రమాలు చేపట్టింది.
అక్టోబర్‌లో రివర్ వ్యూ ప్రాంతంలో నిర్వహించిన ‘హమర్ అర్పా’ ప్రచారం కూడా ఈ ప్రయత్నాల్లో భాగంగా నిలిచింది. నదీతీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంపై నగరం చూపిన శ్రద్ధకు ఈ గుర్తింపు లభించింది.
* చెత్త నిర్వహణలో సాంకేతికతకు రాయ్‌పూర్ ప్రాధాన్యం..
ఛత్తీస్‌గఢ్‌లో అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా రాయ్‌పూర్ మొదటి స్థానాన్ని సాధించింది. శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, బహిరంగ ప్రదేశాల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తమ విజయానికి దోహదపడ్డాయని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలోని పది మున్సిపల్ జోన్ల పరిధిలో నిర్లక్ష్యానికి గురైన 53 బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేశారు. సక్రీలోని సమీకృత వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ప్రతిరోజూ సేకరించే చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తున్నారు.
తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తుండగా, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు. అలాగే నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల మొత్తం సామర్థ్యం రోజుకు 206 మిలియన్ లీటర్లు. చెత్త సేకరణ వాహనాల కదలికలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడం, చెత్తను అక్రమంగా పడేసే ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడం వంటి చర్యలు కూడా చేపట్టారు.

* 4,751 పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే..
స్వచ్ఛ సర్వేక్షణ్ పదో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 4,751 పట్టణ స్థానిక సంస్థల్లో పరిశీలన నిర్వహించారు. 3 వేల మందికి పైగా శిక్షణ పొందిన మదింపుదారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. మొత్తం 10 కీలక విభాగాల్లో 43 సూచికల ఆధారంగా పట్టణాల పనితీరును అంచనా వేశారు.
ఇందులో చెత్తను వేరు చేయడం, ఇంటింటికీ చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగునీటి నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, ప్రజల అభిప్రాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
మొత్తంగా బిల్హాలో మహిళల భాగస్వామ్యంతో చెత్త నిర్వహణ, బిలాస్పూర్లో నదీతీర పరిశుభ్రత, రాయ్‌పూర్‌లో సాంకేతికత ఆధారిత పారిశుద్ధ్య కార్యక్రమాలు.. ఇలా మూడు విభిన్న విధానాలు ఛత్తీస్‌గఢ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

