కబ్రా కాన్ ఏనుగు శాటిలైట్ చిత్రం-ఛత్తీస్‌గఢ్
* ఛత్తీస్‌గఢ్‌లో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగు..
* శాటిలైట్ కాలర్ ఏర్పాటుకు అటవీశాఖ అనుమతి..!
* ఏనుగు నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి..
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ‘కబ్రా కాన్ (Kabra Kan Elephant)’గా స్థానికులు పిలుచుకునే ఈ ఏనుగు వరుస దాడులతో భయాందోళనలు సృష్టిస్తోంది. ఓ వ్యక్తిని ఏనుగు వెంబడిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏనుగు దాడుల్లో నవంబర్ 8, 9 తేదీల్లో ముగ్గురు పురుషులు మరణించగా.. నవంబర్ 11న మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఏనుగును మత్తు మందు ఇచ్చి పట్టుకుని శాటిలైట్ రేడియో కాలర్ అమర్చేందుకు అటవీశాఖ అధికారులు అనుమతించారు.
* వ్యక్తిని వెంబడించిన ఏనుగు.. వైరల్‌గా వీడియో..
ఓ బహిరంగ ప్రదేశంలో వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తుండగా, అతడి వెనుక ఏనుగు వేగంగా వెంబడిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. చివరకు ఆ వ్యక్తి తప్పించుకోగా ఏనుగు వెనక్కి వెళ్లిపోయింది. నవంబర్ 11న ఆజ్‌తక్ ప్రచురించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
స్థానికులు ఈ ఏనుగును ‘కబ్రా కాన్ (Kabra Kan Elephant)’ అని పిలుస్తున్నారు. దాని చెవులపై కనిపించే ప్రత్యేకమైన మచ్చల కారణంగా ఈ పేరు వచ్చినట్లు సమాచారం. ఒంటరిగా సంచరిస్తున్న ఈ ఏనుగు ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
* వరుస దాడుల్లో నలుగురు మృతి..
నవంబర్ 8న దీపావళి వేడుకల సమయంలో తొలి రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. సోన్పూర్ సమీపంలో వరి పంటకు కాపలా కాస్తున్న 36 ఏళ్ల మహులాల్ కన్వర్‌పై ఏనుగు దాడి చేసింది.
మరో ఘటనలో 51 ఏళ్ల కృష్ణ రాజ్వాడే ష్యామ్నగర్లో తన సహచరుడితో బయటకు వెళ్లిన సమయంలో ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 9న కంద్రాయ్ గ్రామంలో 55 ఏళ్ల విష్ణు రామ్ కూడా ఏనుగు దాడికి బలయ్యారు. బయటకు వెళ్లిన సమయంలో ఎదురైన ఏనుగు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం.
ఇక నవంబర్ 11 రాత్రి ప్రేమ్‌నగర్ ప్రాంతంలోని ష్యామ్నగర్లో మరో విషాదం చోటుచేసుకున్నట్లు కథనాలు వెల్లడించాయి. ఏనుగు గ్రామంలోకి ప్రవేశించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ మహిళ ఏనుగు బారినపడి మరణించినట్లు సమాచారం. వరుస ఘటనలతో చీకటి పడితే బయటకు వెళ్లాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు.
* ఏనుగుకు శాటిలైట్ రేడియో కాలర్ ఏర్పాటు..
వరుస మరణాల నేపథ్యంలో ఏనుగును మత్తు మందు ఇచ్చి పట్టుకుని శాటిలైట్ రేడియో కాలర్ అమర్చేందుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్), చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ కార్యాలయం అనుమతించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్ 11(1)(a) కింద ఈ చర్యకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఏనుగు కదలికలను నిరంతరం గుర్తించేందుకు ఈ కాలర్ ఉపయోగపడనుంది. సూరజ్‌పూర్, బలరాంపూర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించనున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన పశువైద్యులు ఇందులో పాల్గొంటారు. అవసరమైతే శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల సహాయం కూడా తీసుకోనున్నారు.
కాలర్ అమర్చిన తర్వాత ఏనుగు ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే దానిని తిరిగి సహజ అటవీ ఆవాసంలోకి వదిలిపెడతారు. అనంతరం శాటిలైట్ ద్వారా దాని కదలికలను పర్యవేక్షిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఏనుగు గ్రామాల వైపు కదిలే ముందే ప్రజలను అప్రమత్తం చేయడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం.
* హెచ్చరికలు అందలేదంటున్న గ్రామస్తులు..
దీపావళి సమయంలో జరిగిన మరణాలు అటవీశాఖ హెచ్చరికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఏనుగు తమ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ ప్రకటనలు, వాట్సాప్ హెచ్చరికలు కూడా అందలేదని చెబుతున్నారు. ఏనుగు కదలికలపై గంటగంటకూ సమాచారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే నాలుగు వాహనాల ద్వారా గ్రామాల్లో మైకులతో ప్రకటనలు చేస్తున్నామని, ప్రత్యేక బృందాలు ఏనుగు కదలికలను పర్యవేక్షిస్తున్నాయని అటవీశాఖ తెలిపినట్లు కథనం పేర్కొంది. అయినప్పటికీ హెచ్చరికలు సరైన సమయంలో సంబంధిత గ్రామాలకు చేరుతున్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
* ఛత్తీస్‌గఢ్‌లో పెరుగుతున్న మనిషి-ఏనుగు ఘర్షణలు..
ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో గ్రామాలు, వ్యవసాయ భూములు, ఏనుగుల సంచార మార్గాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండటంతో మనిషి-ఏనుగు (Chhattisgarh Elephant Attack) ఘర్షణలు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏనుగుల దాడుల్లో 340 మందికి పైగా మరణించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. గత 33 నెలల్లో వివిధ కారణాలతో 45కు పైగా ఏనుగులు కూడా మృతి చెందినట్లు తెలిపారు.
ప్రస్తుతం సూరజ్‌పూర్, బలరాంపూర్, సర్గుజా జిల్లాల పరిధిలో సంచరిస్తున్న ‘కబ్రా కాన్’ ఏనుగు కదలికలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. శాటిలైట్ కాలర్ ద్వారా దాని స్థానాన్ని గుర్తించారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు సకాలంలో చేరవేయడం అత్యంత కీలకం. మరో ప్రాణనష్టం జరగకుండా అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

