హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్
* అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
* లా అండ్ ఆర్డర్ కే తొలి ప్రాధాన్యం
* అంతర్రాష్ట్ర ముఠాలపై ఉక్కుపాదం
* హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా నిర్ణయాలు
* బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ కొత్త పోలీస్ కమిషనర్‌గా (Hyderabad CP New CP) మహేష్ భగవత్ (Mahesh Bhagwat) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్ కే తన తొలి ప్రాధాన్యమని, ఆ విషయంలో రాజీపడే అవకాశమే లేదని ప్రకటించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు.
సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపడతానని వెల్లడించారు. పోలీసు సిబ్బందికి కూడా గట్టి హెచ్చరికలు చేశారు. పోలీసులు అవినీతిని పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సివిల్ సెటిల్మెంట్లు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎటువంటి వారికైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా చర్యలు చేపడతామన్నారు. అంతర్రాష్ట్ర ముఠాలపై ఉక్కుపాదం మోపుతా అన్నారు.
* కమ్యూనిటీ పోలీసింగ్..
తెలంగాణ పోలీసు శాఖలో జరిగిన భారీ ప్రక్షాళనలో భాగంగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా 1995 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ (IPS Mahesh Bhagwat) బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు డీజీపీ (లా అండ్ ఆర్డర్) హోదాలో విశేష సేవలందించిన ఆయన, వీసీ సజ్జనార్ స్థానంలో నగర పోలీస్ బాస్‌గా నియమితులయ్యారు. మూడు దశాబ్దాల తన సుదీర్ఘ పోలీస్ కెరీర్లో కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా నిరోధం, మరియు సామాజిక సేవ ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
* నగరంపై పూర్తి అవగాహన..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పథార్డిలో 1969లో జన్మించిన మహేష్ భగవత్, సాధారణ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో పాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపికైన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్గొండ, కడప జిల్లాలకు ఎస్పీగా పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో డీసీపీగా, జాయింట్ సీపీగా పనిచేసిన అనుభవం ఆయనకు నగరంపై పూర్తి అవగాహనను కల్పించింది.
* కీలక సేవలు..
2016లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు తొలి కమిషనర్‌గా భగవత్ నియమితులయ్యారు. దాదాపు ఆరున్నరేళ్ల పాటు సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత సీఐడీ చీఫ్‌గా, రైల్వే & రోడ్ సేఫ్టీ విభాగాధిపతిగా, ఇటీవల లా అండ్ ఆర్డర్ డీజీపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
మహేష్ భగవత్ (Mahesh Bhagwat) కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాకుండా సామాజిక సంస్కరణలకు పెద్దపీట వేశారు. నల్గొండ ఎస్పీగా ఉన్న సమయంలో సాంప్రదాయ వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళల విముక్తి కోసం ‘ఆసరా’ ప్రాజెక్టును చేపట్టారు. అలాగే ఒడిశా నుంచి ఇటుక బట్టీలకు వలస వచ్చిన బాలకార్మికుల కోసం ‘వర్క్‌సైట్ స్కూల్స్’ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
ఈ సేవలకు గాను 2017లో అమెరికా విదేశాంగ శాఖ నుంచి ప్రతిష్ఠాత్మక ‘ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ (TIP) రిపోర్ట్ హీరోస్ అవార్డు’ అందుకున్నారు. 2004లో శౌర్య పతకం , 2011లో మెరిటోరియస్ సర్వీస్ మెడల్, 2022లో విశిష్ట సేవా పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
* వాట్సప్ గురూ..
విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు మహేష్ భగవత్ ఉచితంగా మెంటార్షిప్ అందిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తూ ఎందరో యువతను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించి ‘వాట్సాప్ గురు’గా పేరుగాంచారు.
కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు, పేదలకు ఆహారం అందించడంలోనూ ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. హైదరాబాద్ సీపీగా ముందున్న లక్ష్యాలుహైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహేష్ భగవత్ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.
నగరంలో సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడం, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తన ప్రధాన లక్ష్యాలని ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా నగర ప్రజలకు మరింత మెరుగైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

