గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన అమెరికన్ కుటుంబం
* అమెరికా కుటుంబం గిన్నిస్ రికార్డు..
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : అమెరికాకు చెందిన ఓ కుటుంబంలో అద్భుతమైన యాదృచ్ఛికం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల వారు (Five Generations Same Birthday) ఒకే తేదీన జన్మించారు. తాత, ముత్తాత, తల్లి, కొడుకు ఇలా ఐదు తరాలకు చెందిన ఐదుగురి పుట్టినరోజు సెప్టెంబర్ 14 కావడం విశేషం. 118 ఏళ్ల వ్యవధిలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
* 1907లో మొదలైన అరుదైన పుట్టినరోజుల పరంపర..
ఈ కుటుంబంలో పుట్టినరోజుల పరంపర 1907లో ప్రారంభమైంది. తొలుత విల్బర్ హార్లో సెప్టెంబర్ 14, 1907న జన్మించారు. ఆ తర్వాత ఆయన కుమార్తె యాడీ హార్లో 1949 సెప్టెంబర్ 14న జన్మించారు.
అనంతరం ఆమె కుమారుడు డొనాల్డ్ (ఫ్రెడ్) హార్లో 1972 సెప్టెంబర్ 14న జన్మించారు.ఇక ఫ్రెడ్ కుమార్తె ఎమ్మా బెల్ 1997 సెప్టెంబర్ 14న జన్మించారు. ఈ క్రమంలో ఎమ్మా బెల్కు 2025 సెప్టెంబర్ 14న ఆర్థర్ బెల్ అనే కుమారుడు జన్మించాడు. దీంతో ఐదు తరాల పుట్టినరోజులు ఒకే తేదీన ఉండే అరుదైన యాదృచ్ఛికం పూర్తయింది.
* అమ్మమ్మ కోరిక.. నిజమైన మనవడి జననం..
ఈ ప్రత్యేకత వెనుక మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఎమ్మా బెల్ చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ యాడీ హార్లో సెప్టెంబర్ 14న పుట్టే అబ్బాయి కుటుంబంలో జన్మించాలని సరదాగా చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు.
ఎమ్మా రెండోసారి గర్భం దాల్చినప్పుడు వైద్యులు ప్రసవ తేదీని సెప్టెంబర్ 14గా నిర్ణయించారు. అయితే శిశువు నిర్ణీత తేదీకి ముందే జన్మించే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యుల్లో కొంత ఉత్కంఠ నెలకొంది.
చివరకు ఆర్థర్ అనుకున్న తేదీనే జన్మించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఎమ్మా మాట్లాడుతూ.. తన కుమారుడి జననం తనకు ఎంతో ప్రత్యేకమైన బహుమతిగా నిలిచిందని భావించారు.
అయితే ఆర్థర్ జన్మించే సమయానికి ఆయన ముత్తవ్వ యాడీ హార్లో జీవించి లేరు. ఆమె బతికుంటే ఈ పరిణామం చూసి ఎంతో సంతోషించేవారని ఎమ్మా భావించారు.
* అబ్బాయి.. అమ్మాయి.. అబ్బాయి.. అమ్మాయి.. అబ్బాయి
ఈ కుటుంబంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఐదు తరాల జనన క్రమంలో లింగాల పరంగా కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మొదటి తరం విల్బర్ అబ్బాయి కాగా.. రెండో తరం యాడీ అమ్మాయి. మూడో తరం ఫ్రెడ్ అబ్బాయి, నాలుగో తరం ఎమ్మా అమ్మాయి, ఐదో తరం ఆర్థర్ అబ్బాయి. ఇలా వరుసగా అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి జన్మించడం మరో విశేషం.
* గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం..
ఒకే కుటుంబంలో నాలుగు తరాల వారు ఒకే తేదీన జన్మించిన సందర్భాలు గతంలో ఉన్నప్పటికీ, ఐదు తరాల (Five Generations Same Birthday) వారు ఒకే పుట్టినరోజును పంచుకోవడం మాత్రం అరుదైన ఘనతగా నిలిచింది.
ఈ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. 2025 సెప్టెంబర్ 14న ఆర్థర్ జన్మించడంతో ఈ రికార్డు సాధ్యమైంది. 2026లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఐదు తరాల ఒకే పుట్టినరోజు రికార్డుగా నమోదు చేసింది. మొత్తం 118 ఏళ్ల వ్యవధిలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఒకే తేదీన జన్మించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

