సమావేశంలో మాట్లాడుతున్నా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
* నవంబర్ 19 నుంచే నమోదు!
* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Life Insurance Scheme) నమోదు ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల నమోదు ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ఈ పథకం అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల నమోదు, అధికారుల బాధ్యతలు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.
* ప్రతి కుటుంబంలో ఒకరికి బీమా అవకాశం
ఈ పథకం కింద ప్రతి కుటుంబం నుంచి ఉపాధి పొందుతున్న ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తున్నట్లయితే ఆ వ్యక్తికి బీమా వర్తిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న కుటుంబాల్లో ఎవరికి బీమా కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని భట్టి విక్రమార్క వెల్లడించారు.
* నామినీల ఎంపికలో కుటుంబానికే స్వేచ్ఛ
బీమా వర్తించే వ్యక్తి మరణించిన సందర్భంలో పరిహారం అందుకునేందుకు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా బీమా ద్వారా లభించే రూ.5 లక్షలను ఎంపిక చేసిన నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకునే అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల కుటుంబ అవసరాలకు అనుగుణంగా నామినీలను ఎంపిక చేసుకోవచ్చు.
* గ్రామాలు, పట్టణాల్లో ఒకేసారి నమోదు
నవంబర్ 19 నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఏకకాలంలో నమోదు ప్రక్రియ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
నమోదు సమయంలో కుటుంబ సభ్యులు అందించే వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. నమోదు చేసిన సమాచారాన్ని తిరిగి చదివి వినిపించి, వివరాలు సరైనవేనని కుటుంబ సభ్యులు నిర్ధారించిన తర్వాతే వారి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
* నవంబర్ 17, 18 తేదీల్లో దండోరా
పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో దండోరా వేయించాలని భట్టి విక్రమార్క సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి పథకం వివరాలు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. దండోరాతో పాటు వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేపట్టాలని తెలిపారు.
* దేశంలోనే ప్రత్యేకమైన పథకంగా తెలంగాణ
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఈ కార్యక్రమం దేశంలోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి మరణించినా ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
నవంబర్ 19న ప్రారంభం కానున్న నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

