మండల పంచాయతీ అధికారి (MPO) కూచన ప్రకాశ్
* విద్యార్థులకు ఎంపీవో ప్రకాశ్ పిలుపు!
* బాలల గ్రామ సభలో విద్యార్థులకు దిశానిర్దేశం
ఆకేరు న్యూస్, రాయపర్తి: విద్యార్థులు చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని రాయపర్తి మండల పంచాయతీ అధికారి (MPO) కూచన ప్రకాశ్ సూచించారు. విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయంలోనే భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు.
శనివారం రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ గారే సహేంద్ర అధ్యక్షతన నిర్వహించిన బాలల గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని చెప్పారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మకత, సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాలలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో చిన్నారుల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించేందుకు బాలల గ్రామ సభలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు.
* విద్యార్థుల సమస్యలకు పరిష్కారం
ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలలోని అవసరాలు, మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిశీలించి, వాటి పరిష్కారానికి గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీవో కూచన ప్రకాశ్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారే కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గుగులోత్ యాకుబ్ నాయక్, ఏపీఎం యాదగిరి, వివిధ శాఖల గ్రామస్థాయి అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

