రిటైర్డ్ ఉద్యోగులు (ఫైల్ ఫోటో)
* 10శాతం వడ్డీ చెల్లించాల్సిందే
* తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
* డిసెంబర్ 4లోగా చెల్లించాలి.. లేదంటే అధికారికి కోర్టు సమన్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులకు (Telangana Retired Employees) అందాల్సిన ప్రయోజనాల (Retirement Benefits) చెల్లింపులో జాప్యం చేయడంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న బెనిఫిట్స్‌పై 10 శాతం వడ్డీ చెల్లించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ప్రశ్నించింది. డిసెంబర్ 4వ తేదీలోగా వడ్డీ చెల్లించాలని, లేనిపక్షంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ సుల్తానియా నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
* ఏడాది గడిచినా అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్..
కామారెడ్డిలో ఎస్ఐగా పనిచేసిన బేతి కోనారెడ్డి 2024 డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ (Telangana Retired Employees) చేసి ఏడాది గడిచినా తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. నాలుగు వారాల్లోగా ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయకపోతే, ఉద్యోగ విరమణ చేసిన తేదీ నుంచి 10 శాతం వడ్డీతో కలిపి బెనిఫిట్స్ చెల్లించాలని స్పష్టం చేసింది.
* బెనిఫిట్స్ ఇచ్చారు.. వడ్డీ మాత్రం చెల్లించలేదు!
హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఆరు వారాలు గడిచినా ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయలేదని పేర్కొంటూ బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బాధితుడి తరఫు న్యాయవాది కీలక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు విధించిన గడువు అనంతరం ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను మాత్రమే చెల్లించిందని, అయితే ఉద్యోగ విరమణ తేదీ నుంచి చెల్లించాల్సిన 10 శాతం వడ్డీని మాత్రం చెల్లించలేదని వివరించారు.
* 23 నెలలకు వడ్డీ ఎందుకు చెల్లించలేదు?
ఈ అంశంపై స్పందించిన న్యాయమూర్తి.. సుమారు 23 నెలల కాలానికి వర్తించే 10 శాతం వడ్డీని ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. వడ్డీ చెల్లింపునకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కేసు విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా బాధితుడికి రావాల్సిన వడ్డీ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వడ్డీ చెల్లించకపోతే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ సుల్తానియా స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
* ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన హెచ్చరిక
రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల చెల్లింపులో జాప్యం జరగడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనే సంకేతాలను ఈ ఆదేశాలు ఇచ్చాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, చట్టపరమైన హక్కుల అమలులో జాప్యం జరగకూడదనే అంశాన్ని ఈ కేసు మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

