IndiaJoy 2026
* ఇండియా జాయ్ 2026కు భారీ ఏర్పాట్లు
* భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 13 వరకు ఇండియా జాయ్ వేడుకలు
* సినీ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాలకు అంతర్జాతీయ వేదిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు, హైదరాబాద్‌ను ప్రపంచ సృజనాత్మక పరిశ్రమలకు (Creative Industries) కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇండియా జాయ్–2026 (IndiaJoy 2026) వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో (Bharat Future City) ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 (Invest Telangana Global Summit 2026)లో భాగంగా ఇండియా జాయ్‌ను నిర్వహించనున్నారు.
Also Read: ‘జంట’గా వస్తున్న పవన్ తేజ్ కొణిదెల..!
సినిమా నుంచి గేమింగ్ వరకు.. ఒకే వేదికపై
సినిమా, యానిమేషన్ (Animation), విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గేమింగ్ (Gaming), ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR), ఓటీటీ (OTT) వంటి రంగాలకు అంతర్జాతీయ స్థాయి వేదికను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇండియా జాయ్–ఫిల్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం
సమావేశంలో ఐటీఈ అండ్ సీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఆరెంజ్ ఎకానమీ (Orange Economy) అభివృద్ధికి హైదరాబాద్‌లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సినీ, సృజనాత్మక పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) పాలసీ, ఇమేజ్ టవర్స్ అభివృద్ధి, పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు.
పరిశ్రమ నుంచి పూర్తి మద్దతు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TG FDC) చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ఇండియా జాయ్ విజయవంతానికి సినీ పరిశ్రమ మొత్తం భాగస్వామిగా నిలిచి సహకరిస్తుందని తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ప్రభుత్వ చొరవను స్వాగతించారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదాల రవి, దర్శకులు హరీశ్ శంకర్, సాయి రాజేష్, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్ర తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాలకు కొత్త అవకాశాలు
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సినీ నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై చర్చించారు. ఫైర్‌ఫ్లై సంస్థకు చెందిన సనత్, ఫాంటమ్‌కు చెందిన బాసిరెడ్డి సునీల్ తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వ్యూహాత్మక సలహాదారు అచల్ మల్హోత్రా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే పదిరెట్ల విస్తృత స్థాయిలో ఇండియా జాయ్–2026 నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ పెట్టుబడిదారులు, స్టూడియోలతో అనుసంధానించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని పేర్కొన్నారు.
లక్ష మందికి పైగా సందర్శకులు.. 200కు పైగా సంస్థలు
సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ఇండియా జాయ్–2026కు లక్ష మందికి పైగా సందర్శకులు, పాల్గొనేవారు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డీఎన్ఈజీ, ఈఏ స్పోర్ట్స్, యూబిసాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి సంస్థలతో కలిపి 200కు పైగా ఎగ్జిబిటర్లు (Exhibitors) పాల్గొననున్నారు.
అలాగే వందకు పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, ఓటీటీ వేదికలు, అంతర్జాతీయ స్టూడియోలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నాయి. వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాన్క్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ (HAIFF) సహా 15కు పైగా ఉప కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 8న రెడ్ కార్పెట్.. 9న కీరవాణి సందడి
ఇండియా జాయ్‌లో భాగంగా డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ (Red Carpet) కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డిసెంబర్ 9న ఆస్కార్ విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎం.ఎం. కీరవాణి చేతుల మీదుగా కచేరీ వేదిక (Concert Stage) ప్రారంభం కానుంది. ఈ వేడుకల ద్వారా తెలంగాణను అంతర్జాతీయ మీడియా, వినోద, సృజనాత్మక పరిశ్రమలకు కీలక కేంద్రంగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.


2 thoughts on “IndiaJoy 2026 | గ్లోబల్ స్థాయికి తెలుగు సినీ పరిశ్రమ”