రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
* విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వేటే : అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్, బెల్లంపల్లి : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పోలీస్ శాఖ క్రమశిక్షణ, ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన సిబ్బందిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) కఠిన చర్యలు తీసుకున్నారు. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్యూటీ సమయంలోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన ఐదుగురు పోలీసులను పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో తొమ్మిది మంది సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఈ నెల 15న తాండూరు మండలం కత్తెర్ల గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అక్కడ విందు, వినోదాలతో పాటు వర్షంలో డ్యాన్స్‌లు చేయడం, స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
* విధుల్లో ఉన్నట్లు నమోదు చేసి వేడుకలకు హాజరు?..
పోలీస్ స్టేషన్ రికార్డుల్లో విధులకు హాజరైనట్లు నమోదు చేసుకుని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే కొందరు సిబ్బంది వేడుకలకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, విధుల నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యం వహించారు? ఎంతమంది సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు? అనే అంశాలను పరిశీలించారు. విచారణ అనంతరం బాధ్యులుగా గుర్తించిన 14 మంది సిబ్బందిపై చర్యలు చేపట్టారు.
* క్రమశిక్షణ విషయంలో రాజీ లేదు : సీపీ అంబర్ కిషోర్ ఝా
పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత ముఖ్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Ramagundam Police Commissioner) స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేయాల్సిన పోలీసు సిబ్బంది విధులను విస్మరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నిబద్ధతతో పనిచేస్తూ పోలీస్ శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడాలని సూచించారు.
భవిష్యత్తులో విధుల్లో నిర్లక్ష్యం వహించినా, శాఖాపరమైన నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో విధి నిర్వహణ, క్రమశిక్షణ విషయంలో ఉన్నతాధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోంది.
Also Read : మహబూబాబాద్‌లో భారీ చోరీ..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

