కేటీఆర్ (ఫైల్ ఫోటో)
* ప్రభుత్వం ఎందుకు మౌనం
* నాగార్జునసాగర్‌పై కొత్త వివాదం
* తెలంగాణ నీటి హక్కులకు ముప్పు
* కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఆకేరు న్యూస్, తెలంగాణ డెస్క్: తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగేలా కృష్ణా నదీ జలాల తరలింపు (Krishna Water Dispute) జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారని విమర్శించారు.
సుమారు 1,600 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో (Krishna Water Dispute) తెలంగాణకు గతంలోనూ అన్యాయం జరిగిందని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఏడాదిగా నిర్మాణ పనులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
* 90 టీఎంసీల నీటి తరలింపునకు ప్రయత్నం..
నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు భారీ పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారని ఆరోపించారు.
సుమారు 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. తాగునీటి పథకం పేరుతో సాగునీటిని కూడా తరలించుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’ పత్రికను అభినందించారు. ఇంత పెద్ద స్థాయిలో నీటి తరలింపు ప్రయత్నాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
* శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపు..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నీటిని తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
హైదరాబాద్‌లో నీటి కొరత ఉందని ప్రజలకు సూచనలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు కృష్ణా జలాల తరలింపు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీశారు. నగరంలో గత అక్టోబర్ నెలలోనే సుమారు రెండున్నర లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయని పేర్కొంటూ, తాగునీటి అవసరాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
* తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆవేదన..
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నీళ్లు, నిధులు, నియామకాల అంశాలు ప్రధానంగా నిలిచాయని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు, నల్లగొండ ప్రాంతాలకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు.
గతంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో పూర్తికాలేదని, పాలమూరు ప్రాంతంలో వలసలు, కరువు సమస్యలు కొనసాగాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు సహా కృష్ణా బేసిన్‌లోని పథకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
* ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్నలు..
తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించేందుకు ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు బోర్డు వద్ద ఎలాంటి అభ్యంతరాలు తెలిపారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదిలో ఎంత నీటిని కేటాయించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన తాగునీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలపై సమగ్ర వివరాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు.
* న్యాయపోరాటం.. ప్రజా ఉద్యమం..
తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను, రైతులను చైతన్యవంతం చేస్తామని తెలిపారు.
నీటి తరలింపు ప్రయత్నాలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ ఈ వ్యవహారంపై స్పందించి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read : ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్

Please tell us what is wrong. Your report will be sent to the website team.


1 thought on “Krishna Water Dispute | కృష్ణా జలాలపై కేటీఆర్ ఫైర్..!”