Mulugu RDO
* ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కండి!
* విద్యార్థులకు ములుగు ఆర్డీవో కృష్ణవేణి సూచన..
ఆకేరు న్యూస్, ములుగు: విద్యార్థుల్లో ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల ప్రక్రియ (Election Process), ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించాలని ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) కృష్ణవేణి సూచించారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేందుకు విద్యార్థులకు ఎన్నికల వ్యవస్థపై అవగాహన అవసరమని పేర్కొన్నారు.
భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల (Electoral Literacy Clubs) ఆధ్వర్యంలో బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆర్డీవో కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 10 మండలాలకు చెందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి విద్యార్థి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్తులో ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగస్వాములుగా మారేలా ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
స్వచ్ఛమైన ఓటరు జాబితా (Electoral Roll) ప్రాముఖ్యత, ఓటు హక్కు విలువ తదితర అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలాగే ఓటరు జాబితా తయారీ, సవరణలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT), పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు.
పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధికారులు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు (Merit Certificates) అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ విజయభాస్కర్, మండల విద్యాధికారి వజ్జ తిరుపతి, డిప్యూటీ తహసీల్దార్ నితీష్, ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

