వివిధ విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలు ప్రదానం
* జిల్లా స్థాయి పోటీల్లో 150 మంది విద్యార్థుల ప్రతిభ
* వివిధ విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలు ప్రదానం
* రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విజేతలు
ఆకేరు న్యూస్, ములుగు: యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ యువజనోత్సవం–2026 విజయవంతంగా ముగిసింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ములుగులోని గిరిజన భవన్లో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. ధర్మానాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి ప్రోత్సహించేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. జానపద నృత్యాలు (Folk Dance), జానపద గీతాలు (Folk Songs), చిత్రలేఖనం (Painting), కవితా రచన (Poetry Writing), వీధి నాటకాలు (Street Play) తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
విజేతలు వీరే..
జానపద నృత్యాల (Folk Dance) విభాగంలో ములుగు టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాల ప్రథమ స్థానం సాధించింది. జానపద గీతాల (Folk Songs) విభాగంలో బండారుపల్లి టీజీఎంఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది.
చిత్రలేఖనం (Painting) విభాగంలో జాకారం టీజీఎస్ ప్రథమ స్థానం, బండారుపల్లి టీజీఆర్ఎస్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. కవితా రచన (Poetry Writing) విభాగంలో వెంకటాపూర్ టీజీఎంఆర్జేసీ ప్రథమ స్థానం, బండారుపల్లి టీజీఆర్ఎస్జేసీ ద్వితీయ స్థానం సాధించాయి. వీధి నాటకాల (Street Play) విభాగంలో ములుగు టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
రాష్ట్ర స్థాయి పోటీలకు అవకాశం
వివిధ విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. ధర్మానాయక్ తెలిపారు. యువత తమలోని నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

