నల్లపోగుల సంజయ్ కుమార్ (60), శోభ (53)
* వరంగల్లో విషాద ఘటన..
* ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం
* కుమారులకు భారం కావొద్దని లేఖలో ప్రస్తావన
ఆకేరు న్యూస్, వరంగల్: అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు ఓ దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక వరంగల్లో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రంగశాయిపేట పరిధిలోని ఎస్బీఐ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్న నల్లపోగుల సంజయ్ కుమార్ (60), ఆయన భార్య శోభ (53) మృతి చెందారు. సంజయ్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్గా (Private Driver) పనిచేస్తుండగా, శోభ టైలరింగ్ (Tailoring) చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, వివాహం అనంతరం ఉద్యోగరీత్యా ముంబైలో (Mumbai) స్థిరపడ్డారు.
కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక కొంతకాలంగా దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అప్పులిచ్చిన వారి నుంచి ఎదురైన ఒత్తిడి, అవమానాలు వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. వారితోపాటు కుటుంబంలో సభ్యుడిగా ఉన్న పెంపుడు కుక్క కూడా మృతి చెందింది. ఘటనా స్థలంలో పోలీసులు (Police) ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆ లేఖలో తాము కుమారులకు భారం కావడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు దంపతులు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. పెంపుడు కుక్కకు కూడా తమతోపాటు అంత్యక్రియలు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు
అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనుకాకుండా ఆప్తులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి. సమస్యలను పంచుకోవడం, తగిన సహాయం పొందడం ద్వారా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

