ఓ పెద్ద బండరాయిపై చిరుత కూర్చున్న దృశ్యాలు
* దూడను చంపి తిన్న వన్యమృ*గం
* దిర్సంపల్లి తండా పరిధిలో పశువుపై చిరుత దాడి
* బండరాయిపై కూర్చున్న చిరుతను వీడియో తీసిన రైతులు
ఆకేరు న్యూస్ వికారాబాద్: జిల్లాలో చిరుత సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దోమ మండలం దిర్సంపల్లి తండా పంచాయతీ పరిధిలోని గోవింద్ బుడ్యా నాయక్ తండాలో చిరుత ఓ గేదె దూడపై దాడి చేసి చంపేసింది. అనంతరం దూడ కళేబరంలోని కొంత భాగాన్ని తినడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. పశువులపై చిరుత దాడి (Leopard Attack) చేయడంతో చుట్టుపక్కల తండాలు, గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు.
* గేదె దూడపై చిరుత దాడి
స్థానిక రైతు నేనావత్ రాజుకు చెందిన గేదె దూడపై చిరుత (Leopard Attack) దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. దాడిలో దూడ మృతి చెందగా, దాని కళేబరంలో కొంత భాగాన్ని చిరుత తిన్నట్లు గుర్తించారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దూడ కళేబరాన్ని పరిశీలించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాళ్ల కోసం తనిఖీలు చేపట్టారు.
* బండరాయిపై చిరుత వీడియో తీసిన రైతులు
ఇదే ప్రాంతంలో ఓ పెద్ద బండరాయిపై చిరుత కూర్చున్న దృశ్యాలను స్థానిక రైతులు తమ సెల్ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిరుత నిజంగానే ఆ ప్రాంతంలో సంచరిస్తోందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు అటవీశాఖ అధికారులు వీడియోను పరిశీలించారు. అలాగే ఘటనా స్థలంలో కనిపించిన పాదముద్రలను కూడా పరిశీలించి చిరుత కదలికలపై ఆరా తీశారు.
* గ్రామస్థుల్లో భయాందోళనలు
ఒకవైపు పశువుపై దాడి జరగడం, మరోవైపు చిరుత బండరాయిపై కూర్చున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో గోవింద్ బుడ్యా నాయక్ తండాతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పొలాల వద్దకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు భయపడుతున్నారు. చిరుత మళ్లీ గ్రామాల వైపు వస్తుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, పశువులపై మరిన్ని దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
* ప్రజలకు అటవీశాఖ హెచ్చరికలు
చిరుత సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, ముఖ్యంగా చీకటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపించవద్దని, పశువులను రాత్రివేళల్లో సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని హెచ్చరించారు. చిరుత కనిపించినా, దాని పాదముద్రలు లేదా ఇతర ఆనవాళ్లు గుర్తించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Read Also : అంగన్వాడీ చిన్నారులకు గుడ్న్యూస్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

