కొండగట్టు అంజన్న ఆలయం (ఫైల్ ఫోటో)
* 60 ఏళ్ల తర్వాత నిజరూప దర్శనం
* కొండగట్టులో ప్రత్యేక వేడుకలు
* 40 రోజుల పాటు నిజరూప దర్శనం
ఆకేరు న్యూస్, జగిత్యాల : కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు శుభవార్త. ఆరు దశాబ్దాల తర్వాత స్వామివారి నిజరూప దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 12 ప్రముఖ ఆలయాల నుంచి అంజన్నకు పట్టు వస్త్రాలు (Silk Clothes) సమర్పించనున్నారు. ఈ విషయాన్ని కొండగట్టు ఆలయ ఈవో అంజనారెడ్డి వెల్లడించారు.
వివిధ ఆలయాల నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20న భద్రాచలం, 24న యాదగిరిగుట్ట, 28న వేములవాడ ఆలయాల నుంచి పట్టు వస్త్రాలు తీసుకురానున్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ గణేశ్ ఆలయం, 5న బాసర, 8న కొమురవెల్లి, 12న ధర్మపురి, 15న వరంగల్ భద్రకాళి, 19న బల్కంపేట ఎల్లమ్మ, 22న కీసరగుట్ట, 26న కర్మన్ఘాట్, 29న సికింద్రాబాద్ మహంకాళి ఆలయాల నుంచి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
వేదపండితులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ఆయా ఆలయాల నుంచి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను కొండగట్టు ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
* 99 కిలోలకుపైగా చందనం తొలగింపు
కొండగట్టు (Kondagattu) ఆలయంలో మూలవిరాట్టుకు ఉన్న చందనాన్ని తొలగించే కార్యక్రమం పూర్తయింది. తొలగించిన చందనాన్ని తూకం వేయగా 99 కిలోల 720 గ్రాములు ఉన్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అధికారుల సమక్షంలో చందనాన్ని తూకం వేసి, సీల్ చేసి భద్రపరిచారు.
చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం నవంబర్ 21 నుంచి డిసెంబర్ 29 వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం (Anjaneya Swamy Darshan) కల్పించనున్నారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత ఈ అరుదైన అవకాశం లభించడంతో కొండగట్టుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం

Please tell us what is wrong. Your report will be sent to the website team.

