Revanth Reddy Comments Viral
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న సొంత పార్టీ నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మనవాళ్లలో కొంతమందికి పిచ్చి కుక్క కరిచినట్లుంది. మైక్ ముందు పిచ్చి లేచినట్లు మాట్లాడుతున్నారు” అంటూ ఘాటు (Revanth Reddy Comments )వ్యాఖ్యలు చేశారు. గురువారం (నవంబర్ 19) సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
* మంచి విషయాలు మైకులో.. చెడు విషయాలు చెవిలో చెప్పాలి..
సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మైక్ ద్వారా వివరించాలని, ఏవైనా లోపాలు ఉంటే వ్యక్తిగతంగా తన దృష్టికి తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు. “చెడు విషయాలను చెవిలో చెప్పాలి.. మంచి విషయాలను మైకులో చెప్పాలి. కానీ కొందరు మనవాళ్లు చెడంతా మైకులో చెబుతున్నారు. మంచి పనులను మాత్రం ఇంటికి వచ్చి చెవిలో చెబుతున్నారు” అని విమర్శించారు.
పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేతల (Revanth Reddy Comments ) వైఖరిని తప్పుబట్టారు. ఇలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తీసుకెళ్తారని వ్యాఖ్యానించారు.
* రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ..
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు. తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, మునుగోడు అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరు చేయకపోతే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు.
మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఏ ఎమ్మెల్యే పేరును నేరుగా ప్రస్తావించలేదు.
* కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిన సీఎం వ్యాఖ్యలు..
ఇప్పటికే నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ అధికారుల తీరుపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.
సొంత పార్టీ నేతల విమర్శలపై సీఎం బహిరంగంగా స్పందించడంతో తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read : రేవంత్ వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.


1 thought on “Revanth Reddy Comments | పిచ్చి కుక్క కరిచిందా..!”