కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
* కాంగ్రెస్లో మాటల యుద్ధం..!
* అధికార అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షించరు
* ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి
* అవినీతి, ప్రజావనరుల దుర్వినియోగాన్ని ప్రజలు క్షమించరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఘాటుగా స్పందించారు. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పోస్టు చేశారు.
ఇటీవల సిద్ధిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగంగా ప్రస్తావిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారిని ఉద్దేశించి ‘ఎర్రి కుక్క కరిచిందేమో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) చేసిన పోస్టు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
*అవినీతికి పాల్పడితే ప్రజలు క్షమించరు..
అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, ప్రజావనరులను దుర్వినియోగం చేస్తూ దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజలు, చరిత్ర ఎన్నటికీ క్షమించవని రాజగోపాల్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా దృఢ సంకల్పంతో, నిజాయితీగా పాలన సాగించాలని సూచించారు.
ముఖ్య నేతలు ఆత్మపరిశీలన చేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, వాటిపై రాజగోపాల్ రెడ్డి చేసిన స్పందనతో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి.
Also Read : రేవంత్ రెడ్డి కామెంట్స్.. పిచ్చి కుక్క కరిచిందా..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.


1 thought on “Komatireddy Raj Gopal Reddy | రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్..!”