సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
* సీఎం రేవంత్ కీలక సమీక్ష
* రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులు
* డ్రైనేజీ నుంచి కోట కందకం వరకు..
* హనుమకొండలో CBD అభివృద్ధి
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాలను (Urban Infrastructure) మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పట్టణాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
ప్రపంచబ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (KFW) బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టులను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పర్యావరణహిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.
* వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం..
ఈ అభివృద్ధి ప్రణాళికల్లో వరంగల్ నగరానికి (Warangal Development Projects) సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ (Underground Drainage System) ఏర్పాటు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ (Storm Water Drainage) అభివృద్ధి, చారిత్రక వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
అదేవిధంగా హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (Central Business District – CBD) అభివృద్ధి ప్రతిపాదనలను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే నగరంలో మురుగునీటి నిర్వహణ, వర్షపు నీటి పారుదల వ్యవస్థలు మెరుగుపడటంతో పాటు చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం లభించనుంది.
* మురుగునీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు వినియోగం
రాష్ట్రంలోని పట్టణాల్లో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేలా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ముఖ్యంగా టెక్స్టైల్ పార్కులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గనుంది.
అలాగే పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని సీఎం అధికారులకు సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల (Renewable Energy) వినియోగాన్ని పెంచాలని స్పష్టం చేశారు.
* వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి..
వరంగల్ (Warangal Development ) మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ (Waste-to-Energy Plant) ఏర్పాటుపైనా సమావేశంలో సమీక్షించారు. ఈ ప్లాంట్ ద్వారా 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. దీంతో పాటు బయో సీఎన్జీ (Bio-CNG) ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా చర్చించారు.
* పర్యావరణ పరిరక్షణే లక్ష్యం..
ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
మొత్తంగా దాదాపు రూ.20 వేల కోట్ల ప్రతిపాదనలతో తెలంగాణ పట్టణాల రూపురేఖలను మార్చేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలు నగరవాసుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయన్నది వేచి చూడాలి.
Also Read : సైబర్ నేరగాళ్లకు పోలీసుల షాక్..

Please tell us what is wrong. Your report will be sent to the website team.


1 thought on “Warangal Development | వరంగల్ రూపురేఖలు మారనున్నాయా?”