POCSO Case
* బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం
* పోక్సో కేసులో కీలక తీర్పు
ఆకేరు న్యూస్, వికారాబాద్ : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసు (POCSO Case) లో నిందితుడికి వికారాబాద్ న్యాయస్థానం 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
* 2017లో బాలికపై లైంగిక దాడి
2017లో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఘటనపై పోలీసులు క్రైమ్ నంబర్ 76/2017గా కేసు నమోదు చేశారు. ఐపీసీ 366, 376(2)(i)(n), 506 సెక్షన్లతో పాటు పోక్సో (POCSO Case) చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో జినుగుర్తి గ్రామానికి చెందిన బండమిడి నర్సింలు (37) నేరానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో నేర నిర్ధారణ (Court Conviction) అయింది. దీంతో వికారాబాద్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పి. ప్రదీప్ నాయక్ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.
* సమర్థవంతంగా దర్యాప్తు
ఈ కేసు దర్యాప్తులో మొదటి దర్యాప్తు అధికారిగా అప్పటి తాండూరు ఎస్హెచ్ఓ ఎం. వెంకట రామయ్య, రెండో దర్యాప్తు అధికారిగా అప్పటి తాండూరు డీఎస్పీ ఎం. రామచంద్రుడు వ్యవహరించారు. ప్రస్తుత తాండూరు ఎస్హెచ్ఓ జి. పరమేశ్వర్ గౌడ్ తదుపరి న్యాయపరమైన ప్రక్రియలను సమన్వయం చేశారు.
ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెరాజ్ ఫిర్దౌస్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. భారోసా కేంద్రం తరఫున కీర్తి ఆకుల బాధితురాలికి న్యాయపరమైన సహకారం అందించారు.
కోర్టు డ్యూటీ అధికారులుగా ఎం.డి. షరీఫ్ (పీసీ 11336), గతంలో పనిచేసిన ఎం.డి. తౌఫీక్ (పీసీ 10327) విధులు నిర్వహించారు. బ్రీఫింగ్ ఆఫీసర్, వికారాబాద్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు లైజన్ అధికారిగా ఎస్. నిరంజన్ గౌడ్ (పీసీ 5598) బాధ్యతలు నిర్వర్తించారు.
* నేరాలపై కఠినంగా వ్యవహరిస్తాం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రతి కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, నేరం రుజువయ్యేలా పటిష్టమైన ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడికి శిక్ష పడేలా సమన్వయంతో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, భారోసా కేంద్రం సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : సైబర్ నేరగాళ్లకు పోలీసుల షాక్..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

