జనచైతన్య సభలో మాట్లాడుతున్న కేటీఆర్
* నా గడ్డం అడ్డమైందా?
* రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
* సుందర్ రాజ్ రాకతో రాజకీయ చర్చ
ఆకేరు న్యూస్, వరంగల్: (ప్రత్యేక ప్రతినిధి) రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏర్పాటు చేస్తున్నదే ఫ్యూచర్ సిటీ.. నిజమైన ఫ్యూచర్ సిటీ మాత్రం వరంగల్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాట్లాడితే నా గడ్డం గురించి మాట్లాడుతాడు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని కోతలు కోయడం కాదు.. దమ్ముంటే కనీసం వారిని లక్షాధికారులనైనా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనచైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరై తనదైన పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
* నిజమైన ఫ్యూచర్ సిటీ వరంగల్
తాము అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ హనుమకొండలోని జనచైతన్య సభలో అన్నారు. అన్ని రకాల పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నాయని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారన్నారు. అందుకే అభివృద్ధి కేంద్రంగా వరంగల్ ఎందుకు కాకూడదని ఆలోచించి వరంగల్‌లో అనేక రకాల ప్రాజెక్టులు ఏర్పాటు చేశారన్నారు. తమ పాలనా కాలంలో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ పార్క్ తదితర ప్రాజెక్టులను ప్రజలకు స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతేకాదు, గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తులం బంగారం, పింఛన్ నెల రోజుల్లోనే రెట్టింపు, మహిళలకు రూ.2,500 ఇస్తానన్న హామీలను కూడా స్క్రీన్‌పై ప్రదర్శించారు.

తెలంగాణలోనే కాదు, దేశంలోనే 24 అంతస్తులున్న భారీ ప్రభుత్వ ఆసుపత్రిని వరంగల్‌లో కేసీఆర్ నిర్మించారన్నారు. పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభించాల్సింది పోయి, తన బినామీ ఆసుపత్రి మెడికవర్‌ను ప్రారంభించారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. మరోవైపు మడికొండలో తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐటీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వాస్తవానికి నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం వరంగల్ అని, దాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ అన్నారు.
* నా గడ్డమే అడ్డమా..?
రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సమస్యలన్నీ వదిలేసి నా గడ్డం మీద పడ్డాడు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇదీ.. కాళేశ్వరం నీళ్లను రైతులకు అందించడం మానేసి గోదావరిలో వదిలేశాడు.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి.. నా గడ్డం నీకు ఏ పని చేయడానికి అడ్డమొచ్చిందంటూ తన గడ్డంపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కేటీఆర్ సభలో తిప్పికొట్టారు.
మరోవైపు తనను చూసి నేను ఆయనలా మారుతున్నానని రేవంత్ రెడ్డి అంటున్నాడని కేటీఆర్ అన్నారు. బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా రేవంత్ రెడ్డిలా మారాలని అనుకుంటారా? మీరు చెప్పండి.. మీరు అనుకుంటారా? అని ప్రజలను అడిగారు. సభికుల నుంచి ‘లేదు.. లేదు’ అని సమాధానం రావడంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి.. ఎవరూ కూడా రేవంత్ రెడ్డిలా మారాలని అనుకోరు కదా.. అని అన్నారు.
* రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ షురూ..?
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మిగిలింది కేవలం ఐదు వందల రోజులేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే బూతు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘నీ లాగుల తొండలు వదిలిపెడతా.. గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని కేటీఆర్ అన్నారు.
ఇటీవల ఒక కొత్త విషయాన్ని పదేపదే చెబుతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారు. కోటీశ్వరులు కాదు.. మహిళలను లక్షాధికారులనైనా చేయండి చాలు.. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 67 లక్షల మంది ఉన్నారు. వారందరికీ 36 నెలలుగా బాకీ ఉన్న ఒక్కో మహిళకు రూ.87,500తో పాటు వచ్చే 24 నెలల మొత్తాన్ని కలిపి రూ.1.50 లక్షలు ఒక్కో మహిళకు ఇవ్వాల్సిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. వాళ్ల ఖాతాల్లో డబ్బులను జమ చేయగలిగితే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి పోతానని కేటీఆర్ సవాల్ విసిరారు.
* సొంత పార్టీ నాయకులే అవినీతి గురించి మాట్లాడుతున్నారు
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ అవినీతి గురించి బయటివాళ్లు కాదు.. సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘మాది పర్సంటేజీల ప్రభుత్వం’ అని ఒకరు, సీఎం సోదరులే బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కూతురే బహిరంగంగా మాట్లాడారన్నారు.
మంచిరేవులుకు సంబంధించిన దేవాదాయ శాఖ భూముల అంశమే తన మంత్రి పదవి పోవడానికి కారణమైందని ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అవినీతి గురించి నేరుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.
ఇంటర్మీడియట్ విద్య రద్దు కూడా పెద్ద కుంభకోణమేనన్నారు. రేవంత్ రెడ్డి కూతురు, మంత్రి పొంగులేటి కూతురు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు.. అందుకోసమే ఈ ఇంటర్మీడియట్ విద్య రద్దు అని కేటీఆర్ ఆరోపించారు.
* పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ స్కెచ్
వరంగల్ నగరంపై పట్టు బిగించి పూర్వ వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ ముందస్తు వ్యూహంతో కదులుతోంది. గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ రెపరెపలాడింది. 2023 తర్వాత ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సాధించలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలును తీవ్రంగా ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు.
మరోవైపు సమాజంలో ఎంతోకొంత ప్రభావం చూపే వ్యక్తులను గులాబీ పార్టీ వైపు నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
గౌరు తిరుపతి రెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హామీ మేరకే తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
* వేదికపై సుందర్ రాజ్ యాదవ్
గత కొంతకాలంగా బీఆర్ఎస్కు దూరంగా ఉన్న మాస్టార్జీ విద్యాసంస్థల అధినేత, మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ జనచైతన్య సభ వేదికపై కనిపించారు. కేటీఆర్‌ను ఆయన శాలువాతో సత్కరించారు.
కాగా, రెండు రోజుల క్రితం కేటీఆర్ స్వయంగా సుందర్ రాజ్‌కు ఫోన్ చేసి సభకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సైతం సుందర్ రాజ్ ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో ఆయన ఈరోజు సభలో ప్రత్యక్షమయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

