Bhogi Movie
* భోగి’లో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉంటుంది : సంపత్ నంది
ఆకేరు న్యూస్, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వానంద్ పూర్తిగా రస్టిక్ అవతారంలో కనిపించనున్న చిత్రం ‘భోగి’. (Bhogi Movie) సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
నవంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. శర్వానంద్ నటన ప్రేక్షకులకు సర్ప్రైజ్గా ఉంటుందని, ఆయన ప్రతి క్లోజప్ డైనమైట్లా పేలిందని చెప్పారు.
* చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ‘భోగి’ కథ..
‘భోగి’ (Bhogi Movie) కథకు తన చిన్ననాటి జ్ఞాపకాలే ప్రేరణ అని సంపత్ నంది తెలిపారు. తమ ఊరికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగిరి గుట్ట ప్రాంతంలో ఒక వ్యక్తి గురించి చిన్నప్పుడు ఎన్నో కథలు వినేవాళ్లమని చెప్పారు. ఆ వ్యక్తి అక్కడికి వస్తే పిల్లలంతా భయపడి పరుగులు తీసేవారని, ఆ సంఘటన తన మనసులో బలంగా నిలిచిపోయిందని వివరించారు.
ఆ జ్ఞాపకానికి కల్పిత అంశాలను జోడించి ‘బొగ్గుల గుట్ట’ అనే గ్రామాన్ని సృష్టించినట్లు తెలిపారు. ఆ గ్రామంలో జరిగిన ఒక సంఘటన చుట్టూ కథను అల్లుకున్నామని చెప్పారు. పాత కాలం నాటి పరిస్థితులు, సంస్కృతి, కట్టుబాట్లు, పద్ధతులు, ప్రేమలు వంటి అంశాలను చూపిస్తూ పీరియాడిక్ కథగా రూపొందించామని వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగినట్లు తనకు అందిన మరో సంఘటన కూడా కథ రూపకల్పనకు తోడైందని పేర్కొన్నారు.
* శర్వానంద్ లుక్ కోసం రెండు నెలల కసరత్తు..
శర్వానంద్‌కు కథను కేవలం 15 నిమిషాల పాటు చెప్పానని, ఆయన వెంటనే అంగీకరించారని సంపత్ నంది తెలిపారు. ఈ పాత్రకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ అవసరమైందని, అందుకోసం శర్వానంద్ లుక్‌ను సిద్ధం చేయడానికి దాదాపు రెండు నెలలు పట్టిందని చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా ఆయన బరువు తగ్గడంతో పాటు మీసాలు, గడ్డం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వివరించారు. నాలుగైదు లుక్ ట్రయల్స్ తర్వాత తుది రూపాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.
శర్వానంద్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడారని, ఆయన నుంచి ఇలాంటి హై వయలెన్స్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ను ప్రేక్షకులు ఊహించలేరని అన్నారు. సినిమా చూసిన తర్వాత శర్వానంద్ తన పనిని అభినందించారని, ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే సంతృప్తి కలిగిందని చెప్పారు. సినిమా కోసం 15 ఎకరాల్లో భారీ గ్రామ సెట్ నిర్మించినట్లు దర్శకుడు వెల్లడించారు.
పాతకాలపు గ్రామీణ వాతావరణం, చెట్లు, అప్పటి జీవనశైలికి అనుగుణంగా ఈ సెట్‌ను రూపొందించామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్, సమయం ఖర్చయ్యాయని, ఇది మూడేళ్ల ప్రయాణమని తెలిపారు. నిర్మాత కేకే రాధామోహన్ ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారని ప్రశంసించారు.
‘గాంజా శంకర్’ కథనే ‘భోగి’గా మార్చారనే ప్రచారంలో నిజం లేదని సంపత్ నంది స్పష్టం చేశారు. ఆ కథ పూర్తిగా క్రైమ్ నేపథ్యంలో ఉంటుందని, ‘భోగి’ మాత్రం గ్రామీణ నేపథ్యంతో సాగే కథ అని తెలిపారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథ అని వెల్లడించారు.
‘భోగి’ టైటిల్ వెనుక కూడా ప్రత్యేకమైన అర్థం ఉందని చెప్పారు. సంక్రాంతికి ముందు వచ్చే పండుగ భోగి గురించి ఈ టైటిల్ కాదని, పాత విషయాలను, చెడును పాతరేసిన తర్వాత వచ్చే భోగి అనే భావనతో పెట్టామని వివరించారు. ఒక గ్రామం నమ్మిన కొన్ని విషయాలు తప్పని నిరూపించడమే కథానాయకుడి లక్ష్యమని తెలిపారు.
* డింపుల్, అనుపమ పాత్రలు ప్రత్యేకం..
సినిమాలో అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని సంపత్ నంది చెప్పారు. అయితే అది సాధారణ ప్రేమకథలా కాకుండా పల్లెటూరి నేపథ్యంలో సహజంగా సాగే బంధంగా ఉంటుందని వివరించారు. డింపుల్ హయాతి, అనుపమ ఇద్దరూ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అనుపమ తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పిందని వెల్లడించారు.
ఈ సినిమాలో స్వచ్ఛమైన తెలంగాణ యాసను వినిపించే ప్రయత్నం చేశామని దర్శకుడు తెలిపారు. ఒకప్పుడు ఉర్దూ ప్రభావం తక్కువగా ఉన్న తెలంగాణ భాషా శైలిని దృష్టిలో పెట్టుకుని సంభాషణలు రాశానని చెప్పారు. తాను తెలంగాణకు చెందినవాడినని, చిన్నప్పటి నుంచి ఆ భాష, యాస, సాహిత్యంపై అవగాహన ఉందని వివరించారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ రూపొందించినట్లు పేర్కొన్నారు.
* బీమ్స్ సంగీతం సినిమాకు ప్రాణం..
సంగీత దర్శకుడు బీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారని సంపత్ నంది ప్రశంసించారు. పాటలన్నీ మంచి స్పందన పొందాయని, ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అలాగే చంద్రబోస్ ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని, చిత్రంలోని పాటలన్నింటికీ ఆయనే సాహిత్యం అందించారని తెలిపారు.
తన గత సినిమాలతో పోలిస్తే ‘భోగి’ తనకు భిన్నమైన ప్రయత్నమని సంపత్ నంది అన్నారు. తన నుంచి ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని, అయితే వాటిని కొత్త పద్ధతిలో చూపించామని వివరించారు. శర్వానంద్ నుంచి ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉంటుందని, ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
* నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల..
మొత్తంగా రస్టిక్ నేపథ్యం, భారీ యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, అన్నాచెల్లెళ్ల అనుబంధంతో రూపొందిన ‘భోగి’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్ విడుదల!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

