AI Engineering in Universities
* ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త సిలబస్
* ఇక అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో AI..
* R-26 పాఠ్యప్రణాళికకు ఏపీ సిద్ధం
* AI, రోబోటిక్స్, డేటా సైన్స్‌పై ప్రత్యేక దృష్టి..
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్యను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి కీలక ప్రణాళిక సిద్ధం చేశాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుసంధానిత R-26 ఇంజినీరింగ్ (AI Engineering) పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఛైర్మన్ ఎస్. విజయ భాస్కరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్త పాఠ్యప్రణాళికలో సంప్రదాయ ఇంజినీరింగ్ సబ్జెక్టులతో పాటు AI, డేటా సైన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
* అన్ని బ్రాంచ్‌లలో AI పరిజ్ఞానం..
ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలు ప్రధానంగా కంప్యూటర్ సైన్స్‌కు (AI Engineering) పరిమితమయ్యాయనే అభిప్రాయం ఉంది. అయితే కొత్త R-26 విధానంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (EEE), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECE), కెమికల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ AI అనువర్తనాలను ప్రవేశపెట్టనున్నారు.
ప్రతి బ్రాంచ్‌కు అనుగుణంగా AI సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా తమ ప్రధాన ఇంజినీరింగ్ రంగంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.
* 160 నుంచి 164 క్రెడిట్లతో పాఠ్యప్రణాళిక..
కొత్త R-26 కరిక్యులమ్‌లో మొత్తం 160 నుంచి 164 క్రెడిట్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రాథమిక శాస్త్రాలు, ఇంజినీరింగ్ సైన్సెస్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ కోర్ సబ్జెక్టులు, ఎలెక్టివ్స్కు చోటు కల్పించనున్నారు. వీటితో పాటు ప్రాజెక్టులు, సెమినార్లు, ఇంటర్న్‌షిప్‌లు, ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను కూడా చేర్చనున్నారు. అయితే క్రెడిట్ల తుది సంఖ్య, బ్రాంచ్‌ల వారీగా సబ్జెక్టుల కేటాయింపు అధికారిక ఆమోదం తర్వాత ఖరారు కానుంది.
* పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికల్ శిక్షణ..
విద్యార్థులకు కేవలం థియరీ పరిజ్ఞానం అందించడం కాకుండా పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, లీడర్షిప్, డిజైన్ థింకింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, పరిశ్రమల సర్టిఫికేషన్లు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన వంటి అంశాలను పాఠ్యప్రణాళికలో భాగం చేయనున్నారు. విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానం, పరిశోధన, బహుళ విభాగాల అధ్యయనం, వృత్తి విద్యకు సంబంధించిన అవకాశాలు కల్పించనున్నారు.
* AICTE మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానం..
కొత్త R-26 పాఠ్యప్రణాళికను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) మోడల్ కరిక్యులమ్, అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE) సూత్రాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తిచేసే సమయానికి ఏయే నైపుణ్యాలు సాధించారనే అంశాన్ని అంచనా వేసే విధానానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముందుగా నమూనా పాఠ్యప్రణాళిక, అమలు మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. అనంతరం ఆయా విశ్వవిద్యాలయాలు తమ బోర్డ్ ఆఫ్ స్టడీస్, అకడమిక్ కౌన్సిళ్లు, ఇతర చట్టబద్ధ సంస్థల ఆమోదంతో అమలు చేయనున్నాయి.
* అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ..
కొత్త సాంకేతిక అంశాలను బోధించేందుకు అధ్యాపకులకు కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు మోడల్ కోర్సులు, ఉత్తమ బోధనా విధానాలను పంచుకునేలా APSCHE చర్యలు చేపట్టనుంది.
* భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి..
సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, రక్షణ రంగం, ఆధునిక తయారీ పరిశ్రమలు, వ్యవసాయం, ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, డిజిటల్ సేవలు వంటి రంగాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ మార్పుల లక్ష్యం. కొత్త R-26 పాఠ్యప్రణాళిక అమలులోకి వస్తే ఏపీ ఇంజినీరింగ్ విద్యలో AI వినియోగం మరింత విస్తరించనుంది. సంప్రదాయ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు కలిగిన గ్రాడ్యుయేట్లను తయారు చేయడంలో ఈ విధానం కీలకంగా మారనుంది.
Also Read : ముంబైలో ఎవరికీ భద్రత లేదా..?

Please tell us what is wrong. Your report will be sent to the website team.

