ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
* కీలక ఫైళ్లు, చెక్కుల విభాగంలో మంటలు
* కాలిబూడిదైన కీలక పత్రాలు
* షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదమా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) జోనల్ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. కార్యాలయంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, అధికారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యమైన రికార్డులు, చెక్కులు భద్రపరిచే విభాగంలోనే మంటలు వ్యాపించడం కలకలం రేపింది.
* తెల్లవారుజామున మంటలు.. అప్రమత్తమైన సిబ్బంది
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉదయం సుమారు 5 నుంచి 6:30 గంటల మధ్య కార్యాలయంలోని రెండో అంతస్తులో మంటలు ప్రారంభమయ్యాయి. వాటిని గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
* కీలక రికార్డులు, చెక్కుల విభాగంలో మంటలు
కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న అకౌంట్స్, చెక్కులు, బిల్లుల మంజూరు విభాగానికి సంబంధించిన గదిలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొన్ని కీలక ఫైళ్లు, పత్రాలు, ఫర్నిచర్ దగ్ధమైనట్లు (Fire Accident) సమాచారం. అయితే ఏయే రికార్డులు పూర్తిగా కాలిపోయాయి? ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
* షార్ట్ సర్క్యూట్ కారణమా?
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. అగ్నిప్రమాదం జరిగిన గదిని పరిశీలించిన తర్వాత రికార్డుల నష్టం, ఆస్తి నష్టంపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
* పలు అనుమానాలు.. విచారణపై ఆసక్తి
ప్రభుత్వ కార్యాలయంలోనే కీలకమైన పత్రాలు భద్రపరిచే విభాగంలో అగ్నిప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విద్యుత్ వ్యవస్థలో ఏమైనా లోపాలున్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, దగ్ధమైన రికార్డుల వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
Also Read : ముంబైలో ఎవరికీ భద్రత లేదా..?

Please tell us what is wrong. Your report will be sent to the website team.

