India A vs Sri Lanka A
* ఫైనల్కు దూసుకెళ్లిన లంక!
* సెంచరీలతో చెలరేగిన క్రూస్పుల్లె, జయవర్ధనే
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భారత్-ఏ జట్టుకు నిరాశ ఎదురైంది. దోహాలో జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక-ఏ జట్టు (India A vs Sri Lanka A) 8 వికెట్ల తేడాతో భారత్-ఏపై ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 41.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో శ్రీలంక-ఏ ఫైనల్లోకి ప్రవేశించగా.. భారత్-ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ (India A vs Sri Lanka A) నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 63 బంతుల్లో 78 పరుగులతో రాణించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 66 బంతుల్లో 53 పరుగులు చేయగా.. షాబాజ్ అహ్మద్ 48 బంతుల్లో అజేయంగా 54 పరుగులు సాధించాడు. దీంతో భారత్-ఏ ప్రత్యర్థి ముందు 318 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. శ్రీలంక బౌలర్లలో జనిత్ లియనగే, నిపున్ ధనంజయ, రవీందు ఫెర్నాండో రెండేసి వికెట్లు పడగొట్టారు.
* సెంచరీలతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏ బ్యాటర్లు భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లు లాసిత్ క్రూస్పుల్లె, సినెత్ జయవర్దనే తొలి వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రూస్పుల్లె 107 బంతుల్లో 116 పరుగులు చేయగా.. జయవర్దనే కేవలం 70 బంతుల్లోనే 105 పరుగులతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత నిషాన్ మదుష్క 56 బంతుల్లో 58 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా శ్రీలంక-ఏ 41.3 ఓవర్లలోనే 318 పరుగులు పూర్తి చేసింది.
భారత బౌలర్లలో షాబాజ్ అహ్మద్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ మాత్రమే తీశారు. మరోవైపు శ్రీలంక బ్యాటర్లు నిలకడగా ఆడి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. దీంతో భారత్-ఏకు ఫైనల్ చేరే అవకాశం చేజారగా.. శ్రీలంక-ఏ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
Also Read : ఐపీఎల్ వేలంలో సెహ్వాగ్ తనయుడు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

