* ఏకంగా తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనుడు
* ఎనిమిది మంది నిందితులు అరెస్టు
* వివరాలు వెల్లడించిన వరంగల్ ఏసీపీనందిరాం నాయక్..
ఆకేరున్యూస్, వరంగల్ : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వరంగల్ ఏసీపీనందిరాం నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొంత మంది వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ముఠా సభ్యులుగా ఏర్పడ్డారు. డబ్బులిస్తే చాలు ఎలాంటి సర్టిఫికెట్ అయినా ఐదు నిమిషాల్లో తయారు చేయడం వీరి నైజం. ఏకంగా వరంగల్ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నిందితులు తమ ఇంటినుంచే నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే, సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డీటీపీ, స్టాంపు, సంతకం ఫోర్జరీ, దళారినీ అరెస్టు చేశామన్నారు. దీంతోపాటు నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో నలుగురిని అరెస్టు చేసినట్లు విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించారు.
ఏనుమాములకు చెందిన పస్తం సతీష్ వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఈ వ్యాపారం చేయాలంటే తహసీల్దార్ ద్వారా జారీ చేయబడే అనుమతి పత్రం తప్పనిసరి. కానీ, సతీష్ తహసీల్దార్ జారీచేసే సర్టిఫికెట్ కాకుండా ఒక నకిలీ సర్టిఫికెట్ ద్వరా మనీ లెండింగ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ వద్దకు వెళ్లి రెన్యువల్ చేయాల్సిందిగా కోరాడు. అది పరిశీలించిన తహసీల్దార్ ఇది నకిలీది అని గుర్తించి మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఎస్సై సాంబయ్య నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదుచేశారు. దేశాయిపేటకు చెందిన ఆభరణాల వ్యాపారి చక్రపాణి ద్వారా సతీష్ ఈ ధృవపత్రాన్ని పొందాడన్నారు. వీరు సతీష్ కే కాకుండా ఇంకా నలుగురికి తహసీల్దర్ ఫోర్జరీ సంతకాల ద్వరా ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కొత్తవాడకు చెందిన గోవిందుల సతీష్ తహసీల్దర్ కార్యాలయంలో లభించే అన్ని రకాల సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసేవాడని చెప్పారు. నిందితుడు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఉద్యోగిలా చలామణీ అవుతూ ప్రజలను మోసం చేసి కొంత డబ్బు తీసుకుని ఫేక్ సర్టిఫికెట్లు అంటగట్టేవాడని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ చెప్పారు. అలాగే, మండి బజారుకు చెందిన ఖాజా మహమ్మద్ అజారుద్దిన్, కాజీపేటకు చెందిన సయ్యద్ సాజిద్, బ్యాంక్ కాలనీకి చెందిన దామోదర్ నకిలీ సర్టిఫికెట్లు పొందారన్నారు. అలాగే, ఏనుమాములకు చెందిన కమలాకర్‌కు గతంలో ఇందిరమ్మ ఇల్లుకోసం ఇచ్చిన సర్టిఫికెట్ ఎక్కడో పడిపోవడంతో మళ్లీ అదేరకమైన సర్టిఫికెట్ కోసం చక్రపాణి, గోవిందుల సతీష్ ను కలిసి ఫేక్ సర్టిఫికెట్ పొందాడు. ఈ లావా దేవీలు కాలంగా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
————————–