* భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అధికారుల సూచన!
ఆకేరున్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలు, చెరువుల వద్దకు స్థనికంగానే కాకుండా ఇతర జిల్లాలనుంచి వచ్చే పర్యాటకులు తమ విహార యాత్రలను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాల ప్రభారం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కొన్ని రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రతీఒక్కరు సహకరించాలి.. ములుగు జిల్లా కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల వాగులు ప్రవహిస్తున్నాయి. కావున, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు పర్యాటకులు బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు, సమ్మక్క- సారలమ్మ దేవాలయానికి రావొద్దని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికులు, విహారయాత్రకు వచ్చే ఇతర జిల్లాల ప్రజలు సహకరించాలని కోరారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో అధికారులు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులు, చేపల వేటపై తాత్కాలికంగా నిషేధం విధించారు. చెరువులు, వాగులు, కాలువల్లో ఈత కొట్టడాన్ని నిషేధించారు.
పాకాల సరస్సు వద్ద ఆంక్షలు..
వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని పాకాల సరస్సు వద్ద కూడా అధికారులు ఆంక్షలు విధించారు. చెరువు మత్తడి పోస్తున్న కారణంగా అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. నర్సంపేట నుంచి మహబూబాబాద్, పాకాల, కొత్తగూడ, గుంజేడు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.