ఆకేరు న్యూస్, భువనగిరి : తెలుగు ఉద్యమకారుడు, యువ తెలంగాణ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (53) (Jitta Balakrishna Reddy) హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జిట్టా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం టీఆర్ ఎస్(Trs)లో చేరారు. పార్టీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో నాటి టీఆర్ ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చెందారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) పోటీచేసి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ కంటే ముందు ఆయన వైసీపీలో కూడా పనిచేశారు.
యువ తెలంగాణ పార్టీ…
2018 సెప్టెంబరు 5న యువ తెలంగాణ పార్టీ(Yuva Telangana Party)ని ఏర్పాటు చేశారు. 2018లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జిట్టా బాలకృష్ణా రెడ్డి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2019 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి తమ పార్టీ తరఫున రాణి రుద్రమ కు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి యువతెలంగాణ పార్టీ తరపున రాణి రుద్రమ రెడ్డి పోటీలో నిలబడ్డారు. అనంతరం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పాల్గొన్నారు. వరుస పరాజయాలతో పార్టీని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీ(bjp)లో విలీనం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుడి మార్పు జరిగాక జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నెల రోజులు కూడా గడువక ముందే గతేడాది అక్టోబర్ 20న సొంతగూటికి చేరారు. అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని జిట్టా కుటుంబసభ్యులు వెల్లడించారు.
—————————-