CM Chandrababu - Andhra Pradesh Summit 2026
* త్వరలోనే డ్రోన్ ఎయిర్ ట్యాక్సీలు
* విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
* ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం
* సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 కొత్త ఒప్పందాల ప్రకటన
ఆకేరు న్యూస్, విశాఖపట్నం : నమ్మకమైన భాగస్వామ్యం ఉంటే విజయాలు వాటంతట అవే వస్తాయని, అపారమైన అవకాశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన వేదికగా నిలుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. గురువారం విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక 31వ సీఐఐ (CII) భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. వివిధ దేశాల మంత్రులు, 40 మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొన్న ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాబోయే కొత్త సంస్కరణలకు ఏపీ నాంది కాబోతోందని, త్వరలోనే డ్రోన్ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయని సంచలన ప్రకటన చేశారు.
* మొదటి హైడ్రోజన్ వ్యాలీకి ఏపీ వేదిక
రాష్ట్రంలో వినూత్న సాంకేతికత, భారీ ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. దేశం పెట్టుకున్న 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధన) ఉత్పాదక లక్ష్యంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 160 గిగావాట్లు అందించబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే, దేశంలోనే మొదటి హైడ్రోజన్ వ్యాలీకి ఏపీ వేదిక కాబోతోందని, తిరుపతిలో స్పేస్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. డేటా సెంటర్లు, ఏరోస్పేస్ రంగాలతో పాటు విశాఖపట్నం సెమీకండక్టర్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
* రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పురోగతి నివేదికను చంద్రబాబు ఈ వేదికగా సమర్పించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 714 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయగా, వీటి ద్వారా రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఇందులో రూ.17.1 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులు ఇప్పటికే అమలు దశలోకి ప్రవేశించాయని, తద్వారా ఒప్పందాల అమలు రేటు 74 శాతానికి చేరుకుందని వివరించారు. అంతేకాకుండా, రూ.7.3 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనులు కూడా ప్రారంభమయ్యాయని, వీటి పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కాలపరిమితులను (టైమ్‌లైన్స్) నిర్దేశించామని చెప్పారు. 74 శాతం అమలు రేటు సాధించడం అతికొద్ది రాష్ట్రాలు, దేశాలకు మాత్రమే సాధ్యమయ్యే గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు.
* భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఏపీలోనే
ప్రస్తుత సీఐఐ సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన మరో 303 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సీఎం ప్రకటించారు. ఈ కొత్త ఒప్పందాలతో కలుపుకుంటే గత రెండేళ్లన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరుకుంటాయని, ఇది భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడి మొత్తం అని చంద్రబాబు స్పష్టం చేశారు. సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని అవకాశాలను అందిపుచ్చుకుని, సదస్సు ముగిసేలోపు కనీసం ఒక ఒప్పందంపై సంతకం చేసేలా ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన నాయకత్వంపై, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉంచి భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామిక దిగ్గజాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
CM Chandrababu Naidu At Partnership Summit-26

Please tell us what is wrong. Your report will be sent to the website team.

