* మహానగరంలో కీలక ఘడియలు
* అనుకున్నట్లుగా మహా గణపతి అంకం పూర్తయితే ప్రశాంతమే
* పోలీసుల ముందస్తు వ్యూహం ఫలించేనా?
* మత సామరస్యానికి ప్రతీకగా ఉత్సవాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహానగరం హైదరాబాద్(Hyderabad)లో రేపు ఎక్కడ చూసినా గణపతుల కోలాహలమే ఉంటుంది. ‘‘గణపతి బొప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా.., గణేశ్ మహరాజ్‌కీ.. జై’’ నినాదాలు మారుమోగుతాయి. అయితే, ఈ సందడి సాఫీగా సాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పోలీసులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ మండపం వద్దా నిఘా ఉంచారు. ఈ సారి నిమజ్జనం రోజున 25వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ (City Police Commisioner Cv Anandh)ఇప్పటికే ప్రకటించారు.
మహా గణపతిం భజే..
మహా నిమజ్జనం జరిగే మంగళవారం నాడు.. మిగతావన్నీ ఓ లెక్క.. ఖైరతాబాద్ భారీ గణపతి(Khairathabad Ganesh) నిమజ్జనం మరోలెక్కగా పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆ కార్యక్రమంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. వీలైనంత త్వరగా ఆ ఘట్టం పూర్తిచేసేలా ప్రణాళికలు రచించారు. ఉదయం 6:30కల్లా భారీకాయుడి పూజ పూర్తి చేసి, ప్రత్యేక క్రేన్ సహాయంతో ట్రాలీపైకి విగ్రహాన్ని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు భారీ ట్రాలీ వాహనం గణపతి ప్రాంగణం వద్దకు ఇప్పటికే చేరుకుంది. ఖైరతాబాద్ నుంచి హుస్సేన్‌సాగర్(Khairathabad to Hussain Sagar) వరకు సాగే శోభాయాత్రలో 70 అడుగుల విగ్రహం కదలకుండా ఉండేందుకు వెల్డింగ్ పనులు చేపడుతున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 వరకు భారీ గణపతి నిమజ్జనం పూర్తి చేసేలా శ్రమిస్తున్నారు. అలా చేయగలిగితే సక్సెస్ అయినట్లే అని సిబ్బందికి సీవీ ఆనంద్ హితబోధ చేశారు. అందుకే రేపు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు గల సమయం చాలా కీలకంగా పోలీసు శాఖ భావిస్తోంది.
19 కిలోమీటర్ల మేర శోభాయాత్ర..
అలాగే, బాలాపూర్(Balapur) నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 19 కిలోమీటర్ల ప్రధాన శోభాయాత్ర సాఫీగా సాగడంపైనా పోలీసు అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే పలుమార్లు ఆ మార్గాలను పరిశీలించారు. 18 జంక్షన్లు ముఖ్యమైనవిగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పోలీస్, పారామిలటరీ బలగాలను మోహరింపచేయనున్నారు. కాగా, బాలాపూర్ గణనాథుడి నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైన తర్వాతే, మిగతావి మొదలవుతాయి. అటువంటి కీలక శోభాయాత్ర కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఎంబీఎన్ఆర్ ఎక్స్‌రోడ్డు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్(Charminor), మదీనా, అఫ్జల్ బగూర్జాల్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం, పీవీఎన్ఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటుంది. మొత్తంగా మహా నిమజ్జనఘట్టం ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు బందోబస్తు విషయంలో రాజీ లేకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సిటీ పోలీస్ నుంచి 15 వేలు, ఇతర జిల్లాల నుంచి పదివేలు మొత్తం 25వేల మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహించనున్నారు.
మతసామరస్యానికి ప్రతీకగా..
వినాయక చవితి మొదలైనప్పటి నుంచీ ఉత్సవాల శోభతో మహానగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఏ గల్లీలో చూసినా పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు.. ఏవో ఒక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నింటా అందరూ ఐక్యంగా పాలుపంచుకుంటున్నారు. మతసామరస్యాన్ని చాటుతూ ముస్లిం యువకులు, పెద్దలు కూడా పాల్గొంటున్నారు. అన్నదానాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. పాతబస్తీలో జరుగుతున్న గణేశ్ వేడుకల్లో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ(Mla Mir Julfikar Ali) పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించి, ఘనంగా సత్కరించారు.