meta server down | నేటి యువత సోషల్ మీడియాలోనే మునిగితేలుతోంది. అందులోనూ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో కోట్లాది మంది యూజర్లు నిత్యం గంటల కొద్దీ చూస్తూనే ఉంటారు. ఒక్క క్షణం ఫోన్ హాంగ్ అయితే చాలు విలవిల్లాడే పరిస్థితి. మెటా సంస్థకు చెందిన ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్స్ సర్వర్ ఒక్కసారిగా డౌన్ కావడం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కలకలం రేపింది. పేజీ లోడింగ్ లో సమస్యలు వస్తున్నాయంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఫిర్యాదులు చేశారు.
సోషల్ మీడియా అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్సైట్ అయిన డౌన్ డిటెక్టర్.. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ యూజర్లు 3,00,000 పైగా , ఫేస్ బుక్ యూజర్లు 47,000 మందికి పైగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించింది.
అయితే ఈ సమస్యపై మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందించారు “ప్రజలు మా సేవలను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మాకు తెలిసింది. మేము సమస్య పరిష్కారానికి యత్నిస్తున్నామని ఆయన X (ట్విటర్) వేదికగా వెల్లడించారు. మరో పోస్టులో.. “ఈ రోజు సాంకేతిక సమస్య కారణంగా ప్రజలు తమ సేవలలో కొన్నింటిని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడ్డారని వివరించారు. దీనివల్ల అసౌకర్యానికి గురైన అందరికీ క్షమాపణలు తెలిపారు.
వినియోగదారులు రాత్రి 8:56 గంటల ప్రాంతంలో తమ ఫీడ్‌లలో కంటెంట్‌ను లోడ్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు చేశారు. యాప్, లాగిన్, అప్లోడ్ కంటెంట్‌తో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్‌లతో సహా నాలుగు మెటా ప్లాట్‌ఫారమ్‌లు చాలా దేశాలలో లాగిన్ సెషన్లకు సంబంధించిన అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని లండన్‌కు చెందిన ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థ నెట్‌బ్లాక్స్ Xలో నివేదించింది.
వాట్సాప్‌పై కూడా ప్రభావం
వాట్సాప్ బిజినెస్ కోసం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) కూడా సమస్యలను ఎదుర్కొంటోందని మెటా స్టేటస్ డ్యాష్‌బోర్డ్ లో పేర్కొంది. డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ కూడా WhatsApp కు సంబంధించి దాదాపు 200 ఫిర్యాదులు అందాయని తెలిపింది. .
X (Twitter)లో ట్రెండింగ్..
మెటా-యాజమాన్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులు చాలా మంది తమ సమస్యలను X, (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. దీంతో Twitter లో ఇది ట్రెండింగ్ అంశంగా మారింది. “సైబర్‌టాక్,” “మార్క్ జుకర్‌బర్గ్, “ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ డౌన్” టాప్-ర్యాంకింగ్ ట్రెండ్స్ గా మారాయి.