ఆకేరు న్యూస్, వరంగల్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా టీవీ చానళ్లు.. వార్తా పత్రికల్లో ప్రణీత్ రావు రావు (DSP Praneet Rao) పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అయితే అసలు ఈ ప్రణీత్ రావు ఎవరు.. ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏంటీ.. ఆయన్ను అరెస్టు చేయడానికి గల కారణాలేంటో పరిశీలిస్తే.. దుగ్యాల ప్రణీత్ రావు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ లో డీఎస్సీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు రాావడంతో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ప్రణీత్ రావును విధుల్లో నుంచి తప్పించింది..
ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారు. ప్రణీత్ రావు అనధికారికంగా పలువురు ప్రతిపక్ష నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం. ప్రణీత్ రావ్ జాబితాలో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే దాదాపు10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్‌ను ప్రణీత్ రావు భద్రపరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆతరువాత ఎస్ఐబీ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే గతేడాది డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయిన మరుసటి రోజు తెలంగాణలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డేటా ను ధ్వంసం చేశారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనధికారిక ఫోన్ ట్యాపింగ్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ)లో విధుల దుర్వినియోగంపై ప్రణీత్ రావుపై కేసులు నమోదయ్యాయి.
సస్పెన్షన్‌కు ముందు ప్రణీత్‌రావు రాజన్న-సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు. అయితే ప్రస్తుతంప్రణీత్రావును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఆ డేటాను ఎవరికి అందజేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లలో వివరాలు ఏమున్నాయనేది విచారిస్తున్నట్లు తెలిసింది.