
- కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్
- ఆరూరి బీఆర్ఎస్ లోనే కొనసాగుతాడా..?
ఆకేరు న్యూస్, వరంగల్ : బీఆర్ఎస్ పొలిటికల్ హైడ్రామాకు తెర పడినట్లేనా .? .ఆరూరి రమేష్ బీఆర్ఎస్ (Aruri Ramesh)లోనే కొనసాగుతాడా ..? ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఇదీ .. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, తాజా మాజీ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పలువురు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికొస్తే… స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ బాట పట్టారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మునిసిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్లు , గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్లు సైతం మెజారిటీ సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ సుధారాణికి మాత్రం ఎంట్రీ దొరకక బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావు దంపతులు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇటీవలే బీజేపీ లో చేరారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ (BRS) నేతలు సైతం అధికార పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
ఆరూరి రమేష్ కోసం వీధి పోరాటం..
మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఎపిసోడ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఆరూరి రమేష్ కోసం వీధి పోరాటానికి దిగడం రాజకీయాల్లో టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారి పోయింది. రాజకీయాలు మరీ ఇంత దారుణమా అని ఈసడించుకునే దుస్థితికి ఆరూరి ఎపిసోడ్ మారిపోయింది.
ఆగమాగం.. ఆరూరి రమేష్ ..!
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ ఘోర పరాజయాన్ని చవిచూశారు.. గత రెండు పర్యాయాలు భారీ మెజారిటీతో వర్థన్నపేట ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్.. ఈసారి ఎన్నికల్లో కూడా అదే స్థాయి లేదా కాస్తా అటూ – ఇటూ మెజారిటీతో గెలుస్తానన్నధీమాతో ఉన్నారు.. కానీ ఊహించని విధంగా ఓటమి పాలు కావడంతో తేరుకోలేక పోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేందుకు ఆరూరి సిద్దపడినట్లు తెలిసింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య (Kadiyam Kavya) కు బీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరిగింది. తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో బీజేపీ వైపు ఆరూరి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆరూరి రమేష్ తాను పార్టీ మారే అవకాశం లేనే లేదని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పదే, పదే ఖండించారు. విషయం బీఆర్ఎస్ అధిష్టానానికి చేరడంతో కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు లు నచ్చజెప్పారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆరూరికే ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ రాజీనామా ప్రకటించి, ఢిల్లీ లో అమిత్ షా అధ్వర్యంలో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అంటున్నారు.
విలేకరుల సమావేశం సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నాగుర్ల వెంకటేశ్వరరావు, ‘కుడా’ మాజీ చైర్మన్ లు యాదవరెడ్డి, సుందర్ రాజ్ తదితరులు హుటాహుటిన ఆరూరి రమేష్ ఇంటిపై దాడిచేసి ఎత్తుకు పోయారని రావు పద్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆరూరి రమేష్ ను తీసుకెళ్తున్న బీఆర్ఎస్ నేతల వాహనాలను జనగామ జిల్లా పెంబర్తి వద్ద అడ్డుకున్నారు. పరస్పరం తోపులాట, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దపడితే టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.. ఆరూరి రమేష్ పోటీకి విముఖత చూపడంతో కడియం కావ్యకు టికెట్ కేటాయించారు.. తాను పార్టీ మారడం లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఈ సందర్భంగా ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. అయితే ఆరూరి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా..? లేదా బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్నది వేచి చూడాల్సిందే..?
1 thought on “పొలిటికల్ స్ట్రీట్ ఫైట్.. ఆరూరి కోసం రాజకీయ హైడ్రామా”