ఆకేరున్యూస్ డెస్క్ : దేశంలో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత పది రోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దేశ, విదేశాలకు వెళ్లే వందకుపైగా విమానాలకు ఇప్పటికే ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 85 విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో 25 ఆకాశా ఎయిర్ ఫ్లైట్స్కాగా, 20 ఎయిర్ ఇండియా, 20 ఇండిగో, 20 విస్తారా ఫ్లైట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు. ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్ అసెస్మెంట్ కమిటీ(బీటీఏసీ) ప్రొటోకాల్, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీల ప్రక్రియను చేపట్టాల్సిందే. దీంతో అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న విమానాలను ఉన్నపళంగా వేర్వేరు విమానాశ్రయాలకు దారి మళ్లించాల్సి వస్తుంది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి. ఒక డొమెస్టిక్ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ.1.5 కోట్లు నష్టం వస్తుందని, అంతర్జాతీయ విమానానికి ఇది దాదాపు రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
…………………………..