* కల్లబొల్లి మాటలు చెప్పి నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
* రెచ్చగొట్టే విధానాలతో రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య
* హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్
ఆకేరున్యూస్, వరంగల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ సాధించడానికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వల్లే జరిగిందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ అన్నారు. ఆదివారం మహమ్మద్ అంకుస్ కాజీపేటలో విలేకరులతో మాట్లాడుతూ కాజీపేటకు 2009లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలో కాజీపేటకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ మంజూరు చేశారన్నారు. నాడు ఎంపీగా ఉన్న సిరిసిల్ల రాజయ్య, దేవాదాయ శాఖ మంత్రి చొరవతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మడికొండ ఎండోమెంట్ భూమిలో 54 ఎకరాలు కేటాయిస్తూ 18 కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు.
శంకుస్థాపన చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, తద్వారా వాయిదా పడ్డ శంకుస్థాపనను ఎన్నికలలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందంతో రైల్వే పరిశ్రమలను నిర్లక్ష్యం చేశారని నాడు పట్టించుకోని వాళ్ళు నేడు మా ఉద్యమ ఫలితమే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ అని ప్రకటనలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు. ఇలాంటి జిమ్మిక్కు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ప్రాంతీయతత్వం, మతతత్వం, వర్గబేదాలను రెచ్చగొట్టే విధానాలతో పదవులకు రావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలను మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.
మతిభ్రమించి ప్రకటనలు చేస్తున్నారు..
కాజీపేట రైల్వే పరిశ్రమల అభివృద్ధి, ప్రాంత అభివృద్ధిపై ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై శ్రద్ధతో, చిత్తశుద్ధితో ప్రణాళిక బద్ధంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎన్నోమార్లు కలిసి విన్నవించారని గుర్తుచేశారు. వేలకోట్ల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పట్టించుకోని నాయకులు 10 నెలల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలో బడుగు బలహీన వర్గాలకు, దళితులక,ు మైనార్టీలకు, వెనుకబడ్డ అందరికీ న్యాయం జరుగుతుందని.. సెక్యులర్ విధానాలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సెక్యులర్ విధానాలను మరువబోదని అంకుస్ తెలియజేశారు. కాజీపేటలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఉద్యమం చేస్తున్న సందర్భంలో నాడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి, చీఫ్ విప్‌గా ఉండి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి నేడు సన్మానాల పేరుతో జిమ్మిక్కులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ నాయకుల మెప్పుకోసమే అబద్ధాలు..
ఖాజీపేట పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి ఉద్యమకారునిగా చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా ఉండి ఒక్కరోజు కూడా కాజీపేట బస్టాండ్ కోసం మాట్లాడకపోవడం ప్రజలు మర్చిపోలేదన్నారు. కేవలం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఉద్యమకారునిగా మన ముందుకు వచ్చి రెచ్చగొట్టే విధానాలతో రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యను అని ఎద్దేవా చేశారు. కేవలం కేసీఆర్, కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్ల మెప్పుకోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. అవి మానుకోవాలని అంకుస్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 63వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయ శ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, డివిజన్ అధ్యక్షులు షేక్ అజ్గర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల ఉపేందర్, శ్రీమతి తమ్మడి మధు మానస, ఇప్ప శ్రీకాంత్, క్రాంతి భరత్, అలీం, బబ్లు, ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ షబ్బీర్ (తబు), లక్ష్మణ్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………………