* పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
* ఏటూరునాగారం ఎన్కౌంటర్పై పూర్తయిన విచారణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భోజనంలో మత్తుపదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపారని న్యాయస్థానానికి తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని న్యాయవాది కోర్టులో వాదించారు. కనీసం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం చేశారన్నారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా మావోయిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించారని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, పోలీసులు భద్రత దృష్ట్యా మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని కోర్టుకు తెలిపారు. కేఎంసీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలోనే పోస్టుమార్టం నిర్వహించారని స్పష్టం చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారని పేర్కొన్నారు.
మృతదేహాలను బంధువులకు చూపించాలి..
ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. అలాగే మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణను రేపటికి(03-12-2024)కి హైకోర్టు వాయిదా వేసింది. మావోయిస్టుల ఎన్కౌంటర్పై డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. మావోయిస్టులపై విషపదార్థాలు ప్రయోగించారనేది దుష్ప్రచారమని అన్నారు. మావోయిస్టులు స్పృహ కోల్పోయాక కాల్పులు జరిపామనడం అవాస్తమని తెలిపారు. వారు అత్యాధునిక ఆయుధాలతో పోలీసులపై కాల్పులు జరిపారని వివరించారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురు తిరిగి కాల్పులు జరపడంతో ఏడుగురు మావోయిస్టులు మరణించారని వెల్లడిరచారు. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకు శవపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించినట్లు డీజీపీ జితేందర్ వివరాలు వెల్లడిరచారు. కాగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ బూటకు ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టులో పౌరహక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విషప్రయోగం జరిగిందని పిటిషన్లో పేర్కొంది. దీనిపై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణను చేపట్టింది. మృతదేహాలను వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం జరపాలని పిటిషన్లో పౌరహక్కుల సంఘం పేర్కొంది. పోస్టుమార్టాన్ని వీడియో ద్వారా రికార్డు చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కుర్సం మంగు, అలియాస్ భద్రుపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు.
ఆత్మ రక్షణ నిమిత్తం కాల్పులు జరిపాం..
పూలకొమ్మ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న గ్రౌండ్స్ బలగాలపై మావోయిస్టులు దాడి చేయడంతో ఆత్మ రక్షణ నిమిత్తం కాల్పులు జరిపామని డీజీపీ జితేందర్ తెలిపారు. మావోయిస్టుల మృతదేహాల తరలింపులో హైడ్రామా చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినా, రాత్రి ఏడు గంటల వరకూ మృతదేహాల తరలింపు జరగలేదు. తొలుత ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్రీజర్లను సైతం సిద్ధం చేశారు. ఆఖరి నిమిషంలో రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఏటూరునాగారం సామాజిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఫోరెన్సిక్ వైద్యులు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం, మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. వారం రోజుల పాటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరుగుతాయని మావోయిస్టులు ముందే ప్రకటించగా, దానికి ఒకరోజు ముందే ఈ ఘటన జరగడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ములుగు ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ పౌరహక్కుల సంఘం నేతలు పలు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. పోలీసులెవ్వరికీ గాయాలు కాలేదని, అసలు ఎన్కౌంటర్ జరిగినట్లు లేదని, అన్నంలో విషం పెట్టి, స్పృహ కోల్పోయిన తర్వాత చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని సంఘం నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్ధలం నుంచి ఆయుధాలు, కిట్ బ్యాగులు, మావోయిస్టు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
…………………………………………………..