* ఆగమేఘాల మీద అజహర్‌కు మంత్రి పదవి
* మైనార్టీల మెప్పు పొందేందుకేనా?\
* మరోవైపు స్వయంగా రంగంలోకి..
* రోడ్ షోలతో జనాల్లోకి..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీలు ఈ స్థానం కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీఆర్ ఎస్ పోరాడుతుండగా, ఇక్కడ గెలిచి గ్రేటర్ లో చక్రం తిప్పాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు కోసం ప్రయత్నం చేస్తున్న కాషాయపార్టీ అందుకు జూబ్లీహిల్స్ మొదటి మెట్టుగా భావిస్తోంది. ఈతరహా రాజకీయ సమీకరణాల క్రమంలో ఇక్కడ గెలిచి మరోమారు తన సత్తా నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం తన శక్తియుక్తులన్నీ వెచ్చిస్తున్నారు. ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు.
చతురతను ప్రదర్శించిన రేవంత్
జూబ్లీహల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. మొత్తం నాలుగు లక్షల పైచిలుకు ఓట్లలో దాదాపు లక్షా 20 వేలు మైనారిటీ ఓట్లే ఉంటాయి. ఒక్క షేక్ పేట డివిజన్ లోనే 55వేల వరకు ఉన్నాయి. ఈక్రమంలో ఆ ఓట్లపై కన్నేసిన రేవంత్.. అందుకు అజహరుద్దీన్ ను ఎరగా వేశారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అజహర్ కు నియోజకర్గంలో పరిచయాలు ఉన్నాయి. ప్రధానంగా మైనారిటీట్లో పట్టు ఉంది. ఇందులో భాగంగా సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి కేటాయించి తన చతురతను చాటారు. ఇప్పటి వరకు నామ్ కే వాస్తేగా ప్రచారంలో పాల్గొన్న అజహరుద్దీన్ రేపటి నుంచి కీలకంగా మారనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పైచేయి సాధించడానికే రేవంత్ ఈ ఎత్తుగడ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిద్వారా మైనార్టీలకు క్యాబినెట్లో చోటు లేదనే బీఆర్ఎస్ విమర్శలు చెక్ పెట్టడంతో పాటు, వారి ఓట్లను ఆకర్షించవచ్చని ఆయన భావనగా తెలుస్తోంది.
స్వయంగా రంగంలోకి..
ఇప్పటి వరకు తెర వెనుక ఉండి నడిపించిన రేవంత్.. ఎన్నికలు సమీపిస్తుండడంతో స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం సాయంత్రం వెంగళరావు నగర్ డివిజన్, పీజేఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా
సాయిబాబా టెంపుల్ వరకు రోడ్ షో నిర్వహించారు. అలాగే, సాయిబాబా టెంపుల్(చాకలి ఐలమ్మ విగ్రహం) వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డి గూడ మార్కెట్ ప్రాంతం
(కృష్ణా అపార్ట్ మెంట్స్ సమీపంలో) వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఒక్క ఓటుతో కాంగ్రెస్ ను గెలిపిస్తే, ఎమ్మెల్యేగా నవీన్, మంత్రిగా అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ కు సేవలు అందిస్తారని ప్రసంగించారు. ఓడినా.. ఆనాడు మాట ఇచ్చిన ప్రకారం.. ఆయనను మంత్రిగా చేసి ప్రచారానికి వచ్చానని పేర్కొని ఆకట్టుకున్నారు.
వరుస సభల ద్వారా..
శనివారం కూడా రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో జరగనున్న ఎన్నికల సభల్లోనూ సీఎం పాల్గొననున్నారు. వరుసగా శుక్ర, శని వారాలు రెండు రోజులపాటు సీఎం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననుండడంతో ఆయా డివిజన్లకు ఇన్‌చార్జీలుగా ఉన్న మంత్రులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మూడు రోజుల కిందట యూసఫ్‌గూడలో సినీ కార్మికుల అభినందన పేరుతో ఓ సభ నిర్వహించారు. కార్యక్రమం పేరు వేరైనా అది కూడా ఎన్నికల సభగానే రేవంత్ నిర్వహించారని బీఆర్ ఎస్ విమర్శిస్తోంది.
…………………………………………………………….
