* 100.. 200.. 300 కాదు.. అంతకు మించే..
* కేరళ వయనాడ్ జిల్లాలో ఘోరవిపత్తు
* ఆ ప్రాంతానికి విషాదాలు కొత్తేంకాదు..
* జూలై, ఆగస్టు నెలలొస్తే అక్కడి వారికి టెర్రర్
ఆకేరు న్యూస్ డెస్క్ :
చుట్టూ పచ్చని కొండలు.. అందాల టీ తోటలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉండే వయనాడ్ (Wayanad) ఇప్పుడు వరదలధాటికి భయానకంగా మారింది. వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. విరిగిపడ్డ కొండచరియల కింద నలిగి వందలాది మంది దుర్మరణం చెందారు. ఇప్పటి వరకూ 280 మృతదేహాలకు పైగానే వెలికితీశారు. అయినా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ప్రకటనలు కలిచివేస్తున్నాయి. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. వరదల్లో కొట్టుకొస్తున్న మృత దేహాల్లో తమ వారున్నారేమో అన్న భయం.. అక్కడివారిని వెంటాడుతోంది. ఏడ్చి.. ఏడ్చి.. కొందరి కళ్లు తడారిపోయాయి. తమవారి ఆచూకీ కోసం దిక్కులుపిక్కటిల్లేలా అరిచి.. అరిచి చాలా గొంతులు అలసిపోయాయి. రెండంటే రెండు రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలు వేలాదిమంది జీవితాల్ని తలకిందులు చేశాయి. గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా పోయాయి. మాటలకందని వయనాడ్ మహా విషాదంలో మృతిచెందిన వారిని అధికారులు ఇంకా లెక్క కడుతూనే ఉన్నారు. ప్రళయాన్ని తలపించిన ఉత్తరాఖండ్ (Uttarakhand) వరదల తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో కేరళ వయనాడ్ వరదలు పెనువిషాదం మిగిల్చాయి.
కేరళను వెంటాడుతున్న విషాదాలు
ఏటా జూలై(July), ఆగస్టు నెలలు వస్తే చాలు.. కేరళలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం కొన్నేళ్లుగా సర్వ సాధారణంగా కనిపిస్తోంది. కేరళ (Kerala) కు పశ్చిమాన విస్తారమైన సముద్రతీరం ఉంటే, తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతి జులై నెలాఖరు, ఆగస్టు (August)నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి. ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ కొన్ని సార్లు ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2018లో వచ్చిన వరదల్లో సుమారు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా 31 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు లెక్కకట్టారు. 2019లోనూ సంభవించిన వరదల కారణంగా 121 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2 లక్షల మంది బాధితులుగా మిగిలారు. అలాగే అదే ఏడాది కొండచరియలు విరిగిపడ్డ (Landslides) ఘటనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 వేల మంది నిరాశ్రయులయ్యారు. 2020 ఆగస్టులో ఇడుక్కి (Idukki), వయనాడ్ (Wayanad), మలప్పురం (Malappuram), కొట్టాయం (Kottayam) ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, విరిగిపడ్డ కొండచరియలు కారణంగా 66మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 42 మంది, 2022లో 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా వయనాడ్ జిల్లాలో జరిగిన ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.
అక్కడే ఎందుకిలా?
కేరళలో కొండ ప్రాంతం కావడం, వందల ఏళ్లుగా ఆ కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పోడు వ్యవసాయం వల్ల మారిపోయిన భూ స్వరూపం అలాగే విపరీతమైన వర్షాల కారణంగా నీటిలో ఎక్కువ కాలం నానుతుండడం వల్ల తరచూ కొండచరియలు విరిగి పడుతున్నాయని నిపుణులు (Experts) చెబుతున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు అధిక వర్షాలకు దారి తీస్తుండగా.. ఆ వర్షాల వల్ల పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయని పేర్కొంటున్నారు. తాజా ప్రమాదంలో భారీ వర్షాల నీటికి బురద, బండరాళ్లు తోడవ్వడం వల్లనే నష్ట తీవ్రత పెరిగినట్లు కనిపిస్తోంది. 2015 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు 3, 782 జరిగితే అందులో కేరళలోనే అత్యధికంగా జరిగాయని 2022లో నాటి కేంద్ర భూగర్భ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ (Union Minister of Geosciences and Science and Technology Union Minister Jitender Singh) పార్లమెంట్ (Parliament) లో ప్రకటించారు. 2024 జనవరిలో కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ సైన్సెస్ (University of Fisheries and Ocean Sciences).. మిచిగాన్ టెక్నాలాజికల్ యూనివర్శిటీ (Michigan Technological University), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీలు (Indian Institute of Tropical Meteorologies) సంయుక్తంగా చేసిన పరిశోధనలో కేరళకు సంబంధించి ప్రమాదకర విషయాలు వెల్లడించాయి. రాష్ట్రం మొత్తం మీద 13 శాతం భూభాగంలో ల్యాండ్ స్లైడ్స్ విరుచుకుపడే ప్రమాదం ఉందని తేలింది. ప్రధానంగా ఇడుక్కి (Idukki), పాలక్కడ్ (Palakkad), మలప్పురం (Malappuram), పతనమిట్ట (Pathanamitta), వయనాడ్ (Wayanad) ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన జోన్ (Danger zone) లో ఉన్నాయని ఆ పరిశోధన వెల్లడించింది. చెప్పినట్లుగానే వయనాడ్లో మహా విషాదం చోటుచేసుకుంది.
చర్చనీయాంశంగా మహా విపత్తు
వయనాడ్ విపత్తు యావత్ ప్రపంచాన్నే కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పార్లమెంట్ (Parliament) స్తంభిస్తోంది. ఈక్రమంలో విపత్తుల నుంచి రక్షణచర్యలపై చర్చ జరుగుతోంది. పర్వత ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతాల్లో నేల క్షయం కాకుండా కాపాడేప్రయత్నాలను మరింత ముమ్మరం చెయ్యాలని యూఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు (Geological Survey Scientists) సూచిస్తున్నారు. అలాగే పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్స్ (Retaining walls) ఏర్పాటు చేయడం ద్వారా నష్టం కొంత వరకు అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. కొండల నుంచి రాళ్లు విరిగి పడే అవకాశాలు ఉన్నచోట ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా కొంత మేర ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. తాజాగా జరిగిన వయనాడ్ మహా విపత్తు నుంచైనా గుణపాఠం నేర్చుకుని భవిష్యత్ లో అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా విపత్తుల నుంచి తప్పించుకునే మార్గాల అన్వేషణ వైపు ప్రభావిత దేశాలు మరిన్ని అడుగులు వేయాలని ఆశిద్దాం.
————————