*తెలంగాణలో వెలుగు చూసిన మానవ అక్రమ రవాణా ముఠా…
*లక్షలకు అమ్ముడవుతున్న గిరిజన మహిళలు
ఆకేరు న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్: పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయక మహిళలను లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ఒక భారీ మానవ అక్రమ రవాణా ముఠాను ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజన యువతులు, మహిళలే లక్ష్యంగా ఈ ముఠా అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వొచ్చని మాయమాటలు చెప్పి వీరిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
*ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల ధర.
తాజా సమాచారం ప్రకారం, ఈ ముఠా ఒక్కో మహిళను సుమారు 2.5 లక్షల రూపాయలకు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే జిల్లాలోని వాడిగూడ గ్రామానికి చెందిన ఒక యువతిని పెళ్లి పేరుతో నమ్మించి 30 లక్షల రూపాయలకు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితులను తరలించిన తర్వాత వారి ఆధార్ కార్డుల్లో చిరునామాలు మార్చి, వారిని వ్యభిచార కూపంలోకి లేదా బలవంతపు వివాహాల్లోకి నెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
*పోలీసుల నిఘా – నిందితుల అరెస్ట్:
ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బెజ్జూర్, ఆసిఫాబాద్ మండలాల్లోని గిరిజన గ్రామాల్లో తిరుగుతూ మహిళలను ప్రలోభపెడుతున్న ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. గిరిజన బిడ్డలు ఇలా అంగట్లో సరకుల్లా అమ్ముడవుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నమ్మించి మోసం చేసే వారి వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.
