
* ఐదు రోజులూ ఈదుకుంటూ సముద్రంలోనే..
* చివరికి బతికి బయటపడ్డ జాలరి రవీంద్రనాథ్ దాస్
* దాస్ ను కాపాడిన బంగ్లాదేశ్ నేవీ
ఆకేరు న్యూస్ డెస్క్ : ఊహించుకుంటే హాలీవుడ్ సినిమాను తలపించే దృశ్యం, తలుచుకుంటూనే ఒళ్లు గగుర్పొడుస్తుంది, ఆ తరువాత ఆశ్చర్యంతో పాటు ఉత్కంఠ ఆపై హమ్మయ్య అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక మనిషి నడి సముద్రంలో ఐదు రోజులు ఈదు కుంటూ బతికి బయట పడ్డాడు.
ఇలాంటి వి మనం సినిమాల్లో చూస్తూఉంటాం.. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతాయనడానికి రవీంద్రనాథ్ దాస్ ఉదంతమే నిదర్శనం. రవీంద్రనాధ్ దాస్ ను బంగ్లాదేశ్ నేవీ సిబ్బంది పడవలోకి చేర్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు విషయం ఏంటంటే…
పశ్చిమ బెంగాల్ లోని పరగణా జిల్లాకు చెందిన రవీంద్రానాధ్ దాస్ అనే జాలరి పదిహేను మంది మిత్రులతో కలిసి పది రోజుల క్రితం బంగాళాఖాతంలో చేపలు పట్టడానికి పడవలో వెళ్లారు.. పడవ సముద్రం మధ్యలోకి వెళ్లగానే అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది. ఒక్క సారిగా అలల ఉధృతి పెరిగి సముద్రం అలల తాకిడికి వీళ్లు ఎక్కిన పడవ తలకిందులైంది. అందులో ఉన్న వారందరూ సముద్ర గర్భంలో కలిసిపోగా ఒకే ఒక్కడు అదే రవీంద్రనాథ్ దాస్ మాత్రమే బతికి బయట పడ్డాడు.
ఐదురోజులు మృత్యువుతో పోరాటం
చుట్టూ సముద్రం కనుచూపు మేరలో సముద్రం తప్ప ఏమీ కన్పించడం లేదు.. కాళ్లు చేతులు శక్తిని కోల్పోతున్నాయి. బతుకుతాననే నమ్మకం లేదు.. కానీ ఎలాగైనా బతకాలనే ఆశ.. జాలరి కాబట్టి సముద్రంలో ఈదడం నేర్చుకున్నాడు.. కానీ ఎంత సేపని ఈదగలడు.. అయినా ఈదాడు.
మొత్తం ఐదు రోజులు ఈదాడు .. నీటిపై తేలుతున్న పడవ ముక్కను ఆధారం చేసుకున్నాడు. తిండి లేక శరీరం సహకరించని పరిస్థితి. తాగడానికి నీళ్లు లేవు. వర్షం నీళ్లతో కడుపునింపుకున్నాడు. ఎదో వస్తుందని ఆశ .. ఎలాగైనా ఒడ్డుకు చేరుతాననే నమ్మకం..
ఆ నమ్మకమే నిజమైంది..
ఐదో రోజు దూరంగా ఓ పడవ కన్పించింది.. ఆ పడవ నెమ్మదిగా తనవైపు రావడం కన్పించింది. అతడిలో ఉన్న పట్టుదలకు మరింత బలం చేకూరింది. బంగ్లాదేశ్ నేవీకి చెందిన ఎంవీ జావాద్ అనే నౌక అతడిని రక్షించింది. నౌక కెప్టెన్ సముద్రంలో ఎవరో కొట్టుకుపోతున్నట్లు గమనించాడు. పడవను అటు వైపు తిప్పాడు. అతడికి సమీపంలోకి చేనుకున్నాక పడవలో ఉన్న నేవీ సిబ్బంది అతడి వైపు లైఫ్ జాకట్ విసిరారు. రవీంద్రనాథ్ దాస్ ఆ లైఫ్ జాకెట్ ను పట్టుకోగలిగాడు. నౌకలో ఉన్న మిగతా వారు క్రేన్ సహాయంతో అతడిని పడవలోకి చేర్చుకున్నారు. ఐదు రోజుల జీవన్మరణ పోరాటం తరువాత అతడు సురక్షితంగా పడవలోకి చేరుకున్నాడు.
…………………………………………..