
* పవన్ కల్యాణ్.. మహేశ్‌బాబు.. ప్రభాస్..
* అందరూ ఆయన శిష్యులే
* నటనలో ఓనమాలు దిద్దింది ఆయన వద్దే
* హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలో సన్మానం
* సభపై పాదాభివందనం చేసిన పవన్
* అందరి దృష్టీ ఆయనపైనే..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, హరిహర వీరమల్లు హీరో పవన్ కల్యాణ్ ఓ వ్యక్తిని కీర్తించడమే కాదు.. ఏకంగా ఆయన కాళ్లకు నమస్కరించారు. శాలువాతో సత్కరించారు. అనంతరం పవన్ ఆయన గురించి మాట్లాడే ముందు.. బైబైయ్యే బంగారూ రమణమ్మా.. బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా.. నువ్వొచ్చే వారం పది రోజులకి.. నిలువుటద్దాల మేడలో రమణమ్మా.. అంటూ పాటలు పాడారు. నా గురువు సత్యానంద్ అని, ఈ ఉత్తరాంధ్ర ఆటాపాటా ఆయన వద్దే నేర్చుకున్నా అన్నారు. ఆయన తనకు నటనే కాదని, జీవిత పాఠాలూ నేర్పారని కొనియాడారు. ధైర్యంగా ఎలా బతకాలో తెలియజేశారన్నారు. తనకు ఏమవ్వాలో తెలియనప్పుడు అన్నయ్య చిరంజీవి యాక్టింగ్ శిక్షణ కోసం సత్యానంద్ వద్దకు తనను పంపినట్లు వివరించారు. దీంతో సత్యానంద్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.
ఎవరీ సత్యానంద్..
సత్యానంద్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. పవన్ కల్యాణ్ కే కాదు.. ఎందరో స్టార్ నటులకు ఆయన నటన నేర్పిన గురువు. కాకపోతే పవన్ కల్యాణ్ ఆయన తొలి విద్యార్థి. ఆయన పూర్తి పేరు లంక సత్యానంద్. రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించిన ఆయన చిరంజీవి ప్రోద్భలంతో సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. పవన్ తో పాటు.. మహేష్ బాబు, ప్రభాస్ వంటి ఎందరినో తెలుగు చిత్రసీమకు రాజులను చేశారు. సుమారు 80 మంది కథానాయకులను ఆయన నటులుగా తీర్చిదిద్దారు. ఏడేళ్ళ వయసులోనే విధి అనే నాటకంలో నటించిన ఆయన.. ఆ నాటకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వీ రంగారావు చేతులమీదుగా బహుమతి అందుకున్నారు.
20 ఏళ్ల వయసులోనే దర్శకులుగా..
సత్యానంద్ తన 20 ఏళ్ల వయసులో శంకరాభరణం ఫేమ్ సోమయాజులు నటించిన అడవి దివిటీ అనే నాటకానికి దర్శకత్వం వహించారు. అది ఒకే థియేటర్ లో 51 రోజులు నడిచి అప్పట్లో సంచలనం సృష్టించింది. బొమ్మలాట అనే నాటకం 102 రోజులపాటు టికెట్ షోగా ప్రదర్శితమై జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 98 సార్లు ఉత్తమ నాటక దర్శకుడిగా అనేక పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి దర్శకత్వ శైలి ఒక పరిశీలన అనే అంశంపైన పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా అందుకున్నారు.
చిరంజీవి వల్లే..
ఎందరో స్టార్ హీరోలు సత్యానంద్ వల్లే ఈ స్థాయిలో ఉన్నామని చెబుతుంటే.. ఆయన మాత్రం చిరంజీవి వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడం గమనార్హం. ఒకసారి అర్జంటుగా చెన్నై రావాలని చిరంజీవిగారు ఫోన్ చేశారని, ఆయనే ఫోన్ చేయడంతో హుటాహుటిన వెళ్లినట్లు సత్యానంద్ చెప్పారు. ఆయన ఇంటికి వెళ్లిన తనకు పవన్ పరిచయం చేస్తూ.. నా తమ్ముడిని నీ చేతిలో పెడుతున్నా అన్నట్లు వివరించారు. ఆయన ప్రోత్సాహంతో యాక్టింగ్ స్కూల్ ప్రారంభించానని, తన మొదటి విద్యార్థి పవన్ కల్యాణ్ అని సత్యానంద్ వివరించారు.
………………………………………………………………..