
– కేంద్ర ప్రభుత్వ పథకాల పేరిట దోపిడీలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ‘ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ.50 వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని వారికి సైబర్ వల విసురుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఆయా పథకాల పేరుతో వచ్చే మెసేజ్లలోని లింకులను క్లిక్ చేయవద్దని పేర్కొంటున్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ సూచనలు పాటిస్తే మీ ఖాతాలు భద్రం
– అపరిచిత లింకులను నమ్మవద్దు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. (pmkisan.gov.in, mudra.org.in)
– వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దు.
– అపరిచిత కాల్స్ వస్తే 1930 నంబరుకు కాల్ చేయాలి. అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.
– ఇలాంటి మోసాల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసి సైబర్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.
– ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www .gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలి.
………………………………………………………