అకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.
కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సుమారు 10 ఫ్లాట్లు వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో అపార్ట్మెంట్ వాసుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
భవనం కూలిన వెంటనే అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడానికి కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ అనుమతులు, భవన నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది.
గతంలోనూ హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలు కూలిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. తాజా ప్రమాదం మరోసారి నిర్మాణ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.