Konda Surekha Show Cause Notice
* రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా? – డా. పరికిపండ్ల అశోక్
* బీసీ మహిళా మంత్రిపై షోకాజ్ నోటీసు విషయంలో వివిధ బీసీ సంఘాల ఆగ్రహం
* ముఖ్యమంత్రిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విమర్శించినప్పుడు స్పందించలేదని ఆరోపణ
అకేరు న్యూస్ హన్మకొండ: దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసిన వ్యవహారంపై వివిధ బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. బీసీల పట్ల ఒక రకమైన న్యాయం, రెడ్డి సామాజిక వర్గం పట్ల మరో రకమైన న్యాయం జరుగుతోందా? అని బీసీ ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు. ఈ అంశంపై హన్మకొండ ప్రెస్ క్లబ్లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సామాజికవేత్త, బీసీ ఉద్యమ నాయకుడు డా. పరికిపండ్ల అశోక్ మాట్లాడారు.
“రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా?” అంటూ ఆయన ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది శాసనసభ్యులు అనేక సందర్భాల్లో ఏకవచనంతో విమర్శించినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం అదే స్థాయిలో స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే బీసీ మహిళగా, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ విషయంలో మాత్రం ప్రభుత్వం అతిగా స్పందించి షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.
బీసీ మహిళా మంత్రి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సామాజిక న్యాయం సూత్రాలకు అనుగుణంగా ఉందా అని డా. అశోక్ పరికిపండ్ల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారిని, ప్రజాప్రతినిధులను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే ఒకే తరహా వ్యాఖ్యలకు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం గురించి మాట్లాడే ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల పట్ల ఒకే విధమైన ప్రమాణాలను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
“బీసీలు కేవలం ఓటు బ్యాంకు కాదు.. ఈ రాష్ట్ర జనాభాలో మెజారిటీ భాగం. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తాం” అని డా. పరికిపండ్ల అశోక్ స్పష్టం చేశారు.
కొండా సురేఖకు జారీ చేసిన షోకాజ్ నోటీసు విషయంలో ప్రభుత్వం తన వైఖరిని పునఃపరిశీలించాలని, అన్ని సామాజిక వర్గాలకు ఒకే న్యాయం వర్తించేలా చర్యలు తీసుకోవాలని బీసీ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బీసీ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల వివక్షకు తావులేకుండా ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరారు.
ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం విషయంలో ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో సమానత్వాన్ని చూపించాలని అన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వివిధ కులసంఘాల బీసీ నాయకులు రాంపెల్లి లింగమూర్తి, ఆడెపు సుధాకర్, డాక్టర్ మియాపురం శివుడు, గోవిందుల జనార్ధన్, తౌటం శ్రీనివాస్, కొండ బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
