* పెళ్లికి వెళ్లి వస్తుండగా రాజస్థాన్లో ప్రమాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : అప్పటి వరకు పెళ్లి వేడుకలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపి.. ఆడిపాడిన ఆ బృందం.. తిరుగు ప్రయాణంలో మృత్యుఒడికి చేరింంది. రాజస్థాన్(Rajasthan)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. కరీం కాలనీకి చెందిన నహ్నూ, జమీర్ కుటుంబ సభ్యులతో కలిసి.. బరౌలీ అనే ప్రాంతంలో వివాహ వేడుకకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి టెంపోలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న స్లీపర్ బస్సు ఢీకొట్టింది. పోలీసులు హుటాహటినా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందగా.. ఇందులో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారిని పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అడిషనల్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ కలెక్టర్ దుర్గా ప్రసాద్ మీనా తదితర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………….