* ర్యాపిడో డ్రైవర్.. వెనుక కూర్చున్న మహిళ దుర్మరణం
* బైకును ఢీకొట్టిన టిప్పర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో టిప్పర్ వాహనాలు టెర్రర్ పుట్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతుండడమే కాకుండా మితిమీరిన వేగంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అంతేకాదు.. ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారు. తాజాగా టిప్పర్ ఢీకొట్టడంతో కుత్బుల్లాపూర్‌లో ర్యాపిడో డ్రైవర్.. వెనుక కూర్చున్న మహిళ దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం సాయిబాబానగర్ పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి (45) ర్యాపిడో బైక్‌ను నడుపుతుంటాడు. సూరారం వెంకట్రామ్ కాలనీకి చెందిన జ్యోతి (32), భర్త శ్రీకాంత్ ఇద్దరు కలసి సమీపంలో ఉన్న క్రాంతినగర్‌లో కూరగాయలు, కిరాణ దుకాణం నడుపుతుంటారు. శ్రీకాంత్ ర్యాపిడో బైక్‌ను బుక్‌చేసి భార్య జ్యోతిని దుకాణం తెరిచేందుకు ఉదయాన్నే పంపిస్తాడు. సోమవారం ఉదయం కూడా ఆమెను దుకాణానికి పంపేందుకు ర్యాపిడో బుక్ చేశాడు. సురేందర్ రెడ్డి ఆమెకు ఎక్కించుకుని సూరారం ఎక్స్ రోడ్డు నుంచి దుండిగల్‌కు వెళ్తున్న క్రమంలో టిప్పర్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో జ్యోతి టిప్పర్ వెనుకటైర్ క్రింద పడగా సురేందర్‌రెడ్డి కొంత దూరం ఎగసిపడి ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………..
