
– భారత ఆయుధ సంపత్తి మరింత శక్తివంతం
– అమ్ములపొదిలోకి అపాచీ హెలికాప్టర్లు
– అమెరికా నుంచి భారత్‌కు రాక
– తొలిదశలో మూడు ఏహెచ్-64ఈ చాపర్లు
– నిమిషానికి 650 బుల్లెట్లు పేల్చగల సామర్థ్యం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుదేశానికి తడాఖా చూపిన భారత్.. అవసరమైన సందర్భంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు శక్తివంతం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక ఆయుధాలు, విమానాలతో పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత సైనం అమ్ములపొదిలోకి ఇప్పుడు మరో ఆయుధం వచ్చి చేరింది. ఒకేసారి వేర్వేరు టార్గెట్లపై రాకెట్లతో దాడి, నిమిషానికి 650 బుల్లెట్లు పేల్చగల సామర్థ్యం దాని సొంతం. అదే ఏహెచ్-64 ఈ చాపర్లు. దాడి హెలికాప్టర్ అనే మరో పేరు కూడా వాటి సొంతం. అత్యంత శక్తివంతమైన ఈ అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు భారత అమ్ములపొదిలోకి కొత్తగా చేరాయి. మూడు చాపర్లను అమెరికా ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ మంగళవారం అందించిందని భారత ఆర్మీ అధికారులు తెలపడం శుభపరిణామం.
మెరుపుదాడి చేయడంలో దిట్ట
ఏహెచ్-64ఈ అపాచీ చాపర్లు విశిష్ఠ లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటిని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసింది. అమెరికా యుద్ధ సమయాల్లో అనేక సార్లు ఉపయోగించింది. ఈ హెలికాఫ్టర్ శత్రువులను తక్కువ ఎత్తులో కూడా గుర్తించి, లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే యుద్ధ సమయంలో వీడియోలను కూడా పంపగలదు. ఏహెచ్-64ఈ అపాచీ మెరుపుదాడి చేయడంలో దిట్ట. ఇది శత్రువు అంచనా వేయకముందే వారిపై దాడి చేస్తుంది. శత్రువులకు చుక్కలు చూపెడుతుంది. భారత వాయుసేనలో 22 ఏహెచ్-64ఈ చాపర్లను చేర్చుకోవడానికి అమెరికాతో ఒప్పందం కుదిరింది. కాగా, 22ఈ మోడల్ చాపర్లను మన వాయుసేనకు 2020లో బోయింగ్ అందించింది. ఆ తర్వాత ఆరు ఏహెచ్-64ఈ హెలికాప్టర్ల కోసం భారత్ ఆర్మీ ఒప్పందం చేసుకుంది.
కచ్చితమైన లక్ష్యంతో..
అపాచీ ఎటాక్ హెలికాప్టర్లకు ఆధునీకరించిన టీఏడీఎస్/పీఎన్వీఎస్ వ్యవస్థను సమకూర్చడం వల్ల అత్యంత రిజల్యూషన్‌తో, కచ్చితమైన లక్ష్యంతో దాడి చేయగలదు. లాంగ్బౌ రాడార్‌ను ఏర్పాటు చేయడం వల్ల సంక్లిష్టమైన యుద్ధపరిస్థితుల్లో వివిధ లక్ష్యాలను గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. డ్రోన్లను కూడా నియంత్రించగలదు. ఈ హెలికాప్టర్ శక్తివంతమైన ఆయుధాలతో కూడి ఉంటుంది, ఇది ఏ యుద్ధంలోనైనా కీలక పాత్ర పోషిస్తుందని ఆర్మీ ప్రకటించింది. బోయింగ్ తో ఒప్పందంలో భాగంగా మొత్తం 6 ఏహెచ్-64ఈ అపాచీ చాపర్లను ఆ కంపెనీ అందించాల్సి ఉంది. తొలిదశలో మూడు చాపర్లు ఇచ్చిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. బహుముఖంగా వినియోగించే అత్యాధునిక ఏహెచ్-64ఈ యుద్ధ హెలికాప్టర్లు ఇప్పటికే అమెరికా ఆర్మీలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటి రాకతో భారత ఆర్మీ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని సోషల్ మీడియా పోస్టులో ఆర్మీ పేర్కొంది.
…………………………………………………….