* టికెట్ల ధరల నియంత్రణకు ఆదేశాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశీయ విమాన టికెట్ల ధరలపై కేంద్రం పరిమితులు విధించింది. 500 కి.మీల వరకు గరిష్టంగా టికెట్ ధర రూ.7,500 ఉండాలని పేర్కొంది. ధరల నియంత్రణపై ఆదేశాలు జారీ చేశామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వల్ల దేశ వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వేళ టికెట్ల ధరలు పెంచడం అవకాశవాదం అంటూ కేంద్రం పరిగణించింది. టికెట్ ధరలపై పరిమితి విధించింది. విమానాల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొంది. వందల సంఖ్యలో విమానాలు రద్దు అయిన సమయంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు వైద్య సహాయం, ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇలాంటి పరిస్థితిలో ధరలు నియంత్రణలో ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు పేర్కొంది. కాగా ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్ల రెండు మూడు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. పలు విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే.. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు శుక్రవారం విమాన టికెట్ కనిష్ఠ ధర రూ.36,668. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర రూ.40,452. ఇండిగో సంస్థ భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో దేశంలో విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.


