
* 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. మండపాల్లో కొలువైన వినాయకులు దర్శనం ఇస్తున్నారు. మూడో రోజు నుంచి నిమజ్జనాలకు కొందరు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనాలను పురస్కరించుకొని పోలీసులు ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 5 వ తేదీ వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆయా రోజుల్లో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్‌లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలుంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా కర్బలామైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు. వాటిని సైలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ వైపునకు పంపుతారు. లిబర్టీ నుంచి ఖైరతాబాద్ వైపునకు వెళ్లే వాహనాలను కవాడిగూడ, డీబీఆర్ మిల్స్ వైపునకు పంపుతారు. రాణిగంజ్ వైపు నుంచి పంజాగుట్ట వైపుకు వెళ్లే వాహనాలను మినిస్టర్ రోడ్, బేగంపేట వైపునకు పంపుతారు. పంజాగుట్ట వైపు నుంచి నెక్లెస్ రోడ్ వైపుకు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపుకు అనుమతించరు. వారిని నిరంకారీ, ఇక్బాల్ మినార్ వైపుకు పంపుతారు. ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపుకు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్టమైసమ్మ, డీబీఆర్ మిల్స్ వైపుకు పంపుతారు. మినిస్టర్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలను కర్బలా, నల్లగుట్ట వైపుకు పంపుతారు. బుద్ద భవన్ వైపునుంచి నెక్లెస్‌రోడ్ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్‌రోడ్ మీదుగా మినిస్టర్ రోడ్ వైపుకు పంపుతారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కోరారు.
……………………………………………..