![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/IMG-20250211-WA0252-1024x682.jpg)
* మొగుళ్లపల్లి మండలంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సుడిగాలి పర్యటన
* ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రభుత్వ గురుకులం ఆకస్మిక తనిఖీ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: జిల్లాలో అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సమయంలో కావలసిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మొగుళ్ళపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల హాజరు నమోదు పట్టిక, ల్యాబ్, ఫార్మాసి, వార్డులను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సేవలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. అత్యవసర సమయాలలో ఉపయోగించే అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలుకు ఎలాంటి ఇబ్బంది రావొద్దని తెలిపారు. అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వంటగది, డైనింగ్ హాల్, విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్నం భోజనంను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత డైట్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతి రోజు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతిరోజు భోజనాన్ని ప్రత్యేక అధికారి, వార్డెన్ తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కూరగాయలు, మాంసం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, ప్రత్యేక అధికారి శారద, ఏటీపీలు ప్రభాకర్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
………………………………….